Singeetham: సింగ్‌ గీతం.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ అంటే..

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:26 PM

ప్రముఖ దర్శకుడు సింగితం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం ‘సింగ్‌ గీతం’.ఇప్పుడీ చిత్రం ఓటీటీ వీక్షకులను అలరించేందుకు సిద్ధమైంది

Sing Geetham


ప్రముఖ దర్శకుడు సింగితం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం ‘సింగ్‌ గీతం’ (Sing Geetham). అయాన్‌, అహిల్యా బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రల్లో నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ వీక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.  జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్  రానుంది. థియేటర్లలో తెలుగు, తమిళ బాషల్లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో తెలుగు, తమిళంతోపాటు కన్నడ, మలయాళం భాసల్లోనూ అందుబాటులోకి రానుంది. అంతేకాదు, డిజిటల్‌ వెర్షన్‌లో ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభూతి కలిగేలా కొన్ని సాంకేతిక మార్పులు చేసినట్లు నిర్మాత నాగ్‌ అశ్విన్‌ తెలిపారు.
  

కథ:

ఆకాశాన్ని తాకే ఎత్తైన కొండల నడుమ పచ్చని చెట్లతో అలరారే కుబేర పురం అనే గ్రామంలో జరిగే కథ ఇది. అక్కడి ప్రతి చెట్టునూ బిడ్డలా చూసుకుంటుంది శైలజ (నివేదా పేతురాజ్ Nivetha Pethuraj). ఆ ప్రాంతంలో గోల్డ్ మైన్ ఉందనే విషయం తెలిసిన ఆమె భర్త ఉదయ్ (రాహుల్ రవీంద్రన్ Rahul Ravindran) భార్యను పురిటికి పట్నం పంపేసి, ఆ గ్రామస్థులను ఒప్పించి, మైనింగ్ తవ్వకాలకు పాల్పడతాడు. పండంటి బిడ్డతో తిరిగి గ్రామానికి వచ్చిన శైలజ జరిగిన దారుణం చూసి కల్లోల పడుతుంది. మైనింగ్ టన్నెల్లో ప్రమాదశాత్తు కన్నుమూస్తుంది. భార్య మరణంతో జీవితంపై విరక్తి కలిగిన ఉదయ్‌... చంటి పిల్లాడిని తీసుకుని గ్రామాన్ని విడిచి వెళ్ళిపోతాడు. చివరి దశలో కన్నుమూసే ముందు ఆ గ్రామంలోని భూమిని కొడుకు ప్రతాప్ (అయాన్) పేరున రాస్తాడు.

తండ్రి నుండి సంక్రమించిన ఆ భూమిని అమ్మడానికి కుబేర పురం వచ్చిన ప్రతాప్ కు వింతవింత అనుభవాలు ఎదువుతాయి. చెట్టే తన తల్లి అని భావించే గౌరి (అహల్య బమ్రూ)ను చూసి కంగుతింటాడు. అప్పటికే తన భూమిని మైనింగ్ కంపెనీకి కాంట్రాక్ట్ కు ఇచ్చారని తెలిసి, తన వాటా కోసం పట్టు బడతాడు. ఊరిలో మిగిలిన చివరి చెట్టును తొలగించి, మైనింగ్ చేయడం మాత్రమే మిగిలి ఉందని రేణు (శాలిని కొండేపూడి Shalini Kondepudi) చెప్పడంతో ఆ చెట్టును నరికేయిస్తాడు ప్రతాప్. అక్కడ నుంచి వారు ఊహించని సంఘటనలు గ్రామంలో జరుగుతాయి. గ్రామస్థులంతా మాటల్ని కూడా పాటల్లా పాడటం మొదలెడతారు. అంతేకాదు... అన్ని నిజాలే చెప్పేస్తుంటారు. అలాంటి ఊహకందని పరిస్థితుల నుంచి గ్రామస్థులు ఎలా బయటపడ్డారు? తన గతం తెలిసిన ప్రతాప్ ఆ ఊరి కోసం ఏం చేశాడు? బంగారం కోసం ప్రకృతిని నాశనం చేయాలనుకున్న ఊరి జనాల మనసులు ఎలా మారాయి? అనేది మిగతా కథ.

Updated Date - Jul 05 , 2026 | 05:27 PM