Sankranthi Movies: సంక్రాంతి చిత్రాలు .. ఏ ఓటీటీల్లోకి వస్తున్నాయంటే
ABN , Publish Date - Jan 04 , 2026 | 09:47 PM
తెలుగు సినిమా సందళ్ళలో పొంగల సీజన్ ను మించినదేదీ లేదు. ఈ సారి పలు స్టార్ మూవీస్ సంక్రాంతి సందడిలో పాలు పంచుకుంటున్నాయి. సదరు చిత్రాలు ఏ యే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతాయో కూడా అప్పుడే డిసైడ్ అయిపోయింది.
ఈ సారి తెలుగునేలపై సంక్రాంతి సంబరాల్లో సినిమా సందడి భలేగా సాగనుంది. రెబల్ స్టార్ ప్రభాస్ 'ద రాజాసాబ్ (The Raja Saab), తమిళ స్టార్ విజయ్ జననాయకుడు (Jana Nayakudu), మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu), మాస్ మహారాజా రవితేజ భర్త జనమహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapathi), నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజు (Anaganaga Oka Raju) చిత్రాలు సంక్రాంతి బరిలో వరుసగా దూకనున్నాయి.
వీటితో పాటు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari) , కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ హీరోగా రూపొందిన పరాశక్తి (Parasakthi) కూడా సంక్రాంతికే రానున్నాయి. ఇలా టాప్ స్టార్ చిరంజీవితో పాటు క్రేజీ స్టార్స్, యంగ్ స్టార్స్ అందరూ పొంగల్ బరిలో నిలవడం విశేషంగా మారింది. దాంతో సినీ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ముందుగా రెబల్ స్టార్ 'ద రాజాసాబ్' సంక్రాంతి సంబరాల్లో జనవరి 9న పాలుపంచుకోనుంది.

ది రాజాసాబ్ (The Raja Saab) తో పాటే 'జననాయకుడు' కూడా జనవరి 9నే వస్తున్నాడు. ఇక జనవరి 14వ తేదీన 'మన శంకరవరప్రసాద్ గారు'తో పాటే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒకరాజు', 'నారీ నారీ నడుమ మురారి', 'పరాశక్తి' వెలుగు చూస్తాయని తెలుస్తోంది. ఖచ్చితంగా థియేటర్ల కొరత ఏర్పడుతుందని టాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏ సినిమాకు ఎలాంటి థియేటర్స్ లభిస్తాయో అన్న ఆసక్తి సినీఫ్యాన్స్ లో కలుగుతోంది. ఈ ఏడు సినిమాలను ప్రేక్షకులు చూడాలంటే వారి జేబులకు చిల్లు పడక తప్పదు. అయితే ఈ చిత్రాలు ఏ యే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో వెలుగు చూస్తాయో కూడా తేలిపోయింది. దాంతో సగటు ప్రేక్షకుడికి కాసింత రిలీఫ్ దక్కినట్టయింది.
'జియో హాట్ స్టార్'లో 'ద రాజాసాబ్' ఉరకలు వేయనుంది. 'అమేజాన్ ప్రైమ్'లో 'జననాయకుడు', 'నారీ నారీ నడుమ మురారి' చిత్రాలు స్ట్రీమింగ్ కానున్నాయి. 'నెట్ ఫ్లిక్స్'లో 'అనగనగా ఒకరాజు', 'పరాశక్తి' వెలుగు చూడబోతున్నాయి. 'జీ ఫైవ్'లో 'మన శంకరవరప్రసాద్ గారు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రాలను ప్రదర్శిస్తారు. సంక్రాంతి చిత్రాలను థియేటర్లలో చూడటానికే జనం ఇష్టపడతారు. అయితే అన్ని చిత్రాలనూ సినిమా హాళ్ళలో తిలకించక పోయినా, మూవీ లవర్స్ ఓటీటీల్లో ఈ సినిమాలను చూసి ఆనందించే అవకాశం ఉంది. మరి ఈ చిత్రాలు థియేటర్లలో ఏ తీరున మురిపిస్తాయో, ఓటీటీల్లో ఏ రేంజ్ లో అలరిస్తాయో చూడాలి.