Peddi OTT: రామ్‌చరణ్ 'పెద్ది'.. ఓటీటీకి వచ్చేసింది
ABN , Publish Date - Jul 09 , 2026 | 06:07 AM
న్యూ ఏజ్ మెగాస్టార్ రామ్‌చరణ్ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ఫిలిం పెద్ది డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
న్యూ ఏజ్ మెగాస్టార్ రామ్‌చరణ్ (Ram charan), జాన్వీ కపూర్ (janhvi kapoor) జంటగా తెరకెక్కిన చిత్రం 'పెద్ది’ (Peddi). 'ఉప్పెన' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఐదేళ్లు సమయం తీసుకుని బుచ్చిబాబు సాన తెరకెక్కించిన చిత్రమిది. జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషఙంచారు. టైటిల్, ఫస్ట్ లుక్ నుంచి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఏఆర్ రెహమాన్ సంగీతంలో విడుదలైన పాటలు కూడా అంచనాలను రెట్టింపు చేశాయి. ఉత్తరాంధ్ర, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథతో రూపొందిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ జూన్ నెల 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది మిక్స్‌డ్ టాక్ సంపాదించుకుంది. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే..
కనీస రవాణా సౌకర్యం, ఎలాంటి గుర్తింపు లేకుండా విజయనగరంలో ఓ అటవీ ప్రాంతంలోని పల్లె అది. కొండ కింద అని పిలుస్తారు. ఆ కొండ మీదుగా ఓ రైలు వెళ్తుంది. కానీ ఆ ప్రాంతంలో స్టేషన్ లేకపోవడంతో రైలు అక్కడ ఆగదు. కాలి నడకనే విజయనగరం వలస వెళ్లి పని చేసుకుని బతుకుతారు. ఆ కొండ కింద ఉండే వ్యక్తి ‘పెద్ది’ (రామ్ చరణ్). క్రికెట్ అంటే పిచ్చి. మంచి ఆటగాడు కూడా. ఆట కూలీగా అతన్ని ఓ జట్టు పాడుకుని క్రికెట్ ఆట ఆడించి గెలిచి పేరు తెచ్చుకుంటారు. అదే టీమ్ పెద్దిని ఓసారి అవమానిస్తుంది. అందుకు కారణమేంటి? ఆట కూలీగా క్రికెట్ ఆడే పెద్ది కుస్తీ వైపు, ఆ తర్వాత రన్నింగ్ వైపు ఎందుకు వెళ్లాడు. అతను ఉంటే కొండ కింద ప్రాంతానికి భారత దేశంలో గుర్తింపు తీసుకురావడానికి ఏం చేశాడు? ఈ జర్నీలో పెద్దికి, అప్పల సూరికి ఉన్న సంబంధం ఏంటి? పెద్దింటి అమ్మాయి అయిన అచ్చియ్యమ్మ పెద్దిని ఇష్టపడటానికి కారణం ఏంటి? వారి ప్రేమ సుఖాంతం అయిందా? అన్నది కథ.
ఇప్పటికే మనం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో అనేక సినిమాలు చూసినప్పటికీ వాటికి భిన్నంగా తెరకెక్కిన సినిమా ఇది. అయితే జాన్వీ కపూర్ పాత్ర విషయంలో తీవ్ర నెగిటీవిటీని మూట గట్టుకున్న ఈ చిత్రం జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీంతో రామ్ చరణ్ అంత కష్టపడి చేసిన దానికి పూర్తి ఫలితం లభించకుండా అయింది. ఈ సినిమాలోని నటనకు గాను చరణ్‌కు నేషనల్ అవార్డు పక్కా అని అంతా అంటుంటూనే జాన్వీ పాత్రను వేలెత్తి చూపారు.
దీంతో సినిమాలో జాన్వీకి సంబంధించిన కొన్ని సీన్లను తొలగించక తప్పని పరిస్థితి ఎదురైంది. అంతేగాక మూవీలో అప్పల సూరి పాత్రను సగంలోనే ముగించారనే న్యూస్ కూడా రావడంతో ఆయన పాత్రకు సంబంధించిన మరి కొన్ని సన్నివేశాలను సినిమాకు జత చేశారు. ఇప్పుడీ సినిమా నుంచి ఈ రోజు (గురువారం) నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ (OTT)లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లలో మిస్సయిన వారు, మెగా అభిమానులు ఇప్పుడు ఇంట్లోనే చూసి ఆస్వాదించవచ్చు.