ఓటీటీకి వ‌చ్చేసిన మునిష్కాంత్ 'ఖాకీ సర్కస్'

ABN , Publish Date - Apr 10 , 2026 | 10:57 AM

ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి ఓ ఫాంట‌సీ, కామెడీ, మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ఖాకీ సర్కస్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

Kaakee Circus

ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి ఫాంట‌సీ, కామెడీ, మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ఖాకీ సర్కస్ (Kaakee Circus) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ప్రముఖ త‌మిళ హాస్య నటుడు మునిష్కాంత్ (Munishkanth) ప్రధాన పాత్రలో న‌టించ‌గా సుభాష్ సెల్వం, రాజేష్ మాధవన్, గౌతమి నాయర్, విన్సు రాచె, సావిత్రి, అమృత, అబ్దుల్ లీ, మరుదుపాండి యన్, రాకేష్ ఉషర్, విఘ్నేశ్వర్, అరుణ్ కుమార్, చిత్తిర సేసన్ ఇత‌ర పాత్ర‌ల్లో నటించారు. అమీన్ బరీఫ్ (Ameen Barif) దర్శకత్వం వహించారు.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ఓ ఇది చిన్నపట్టణ నేపథ్యంలో సాగుతుంది. పోలీస్ స్టేషన్ సమీపంలో కొందరు పోలీసులు కలిసి ఒక ఆలయాన్ని నిర్మించి అందులో ఒక హుండీ పెడతారు. ఒక రోజు ఆ హుండీలోని కానుకలను ఎవరో చోరీ చేస్తారు. ఈ విషయం బయటకు తెలిస్తే అవమానంగా భావించిన పోలీసులు.. ఈ కానుకలను చోరీ చేసిన దొంగ కోసం రహస్యంగా గాలిస్తుంటారు. అయితే, ఈ హుండీలోని కానుకలను చోరీ చేసింది ఎవరు? చోరీకి గురైన కానుకలు తిరిగి లభించాయా? లేదా? అన్నదే ఈ వెబ్ సిరీస్ ప్రధాన కథాంశం. దీనికి హాస్యం, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు జోడించి ఔట్ అండ్ ఔట్ కుటుంబం అంతా క‌లిసి చూసేలా రూపొందించారు.

ఓ పోలీస్‌, దొంగ మ‌ధ్య న‌డిచే టామ్ అండ్ జెర్రీ గేమ్‌లా ఈ సిరీస్ సాగుతూ చూసే వారికి మంచి ఎంట‌ర్టైన్మెంట్ అందిస్తుంది. మొత్తం ఏడు ఎపిసోడ్లుగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఖాకీ సర్కస్ (Kaakee Circus) జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతుండ‌గా కేవ‌లం త‌మిళ భాష‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంది. త్వ‌ర‌లో ఇత‌ర భాష‌ల్లోనూ అందుబాటులోకి తీసుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. డిఫ‌రెంట్ కంటెంట్‌ ను ఇష్ట‌ప‌డే వారికి ఈ సిరీస్ మంచి కాల‌క్షేపం.

Updated Date - Apr 10 , 2026 | 01:37 PM