Sarvam Maya OTT: ఓటీటీకి.. అదిరిపోయే మలయాళ సూపర్ నాచురల్ కామెడీ
ABN , Publish Date - Jan 30 , 2026 | 10:15 AM
గత నెలలో థియేటర్లకు వచ్చి కేరళ నాట సంచలనం సృష్టించిన మలయాళ సూపర్ నాచురల్ కామెడీ చిత్రం సర్వం మాయ.
గత నెలలో థియేటర్లకు వచ్చి కేరళ నాట సంచలనం సృష్టించిన మలయాళ సూపర్ నాచురల్ కామెడీ చిత్రం సర్వం మాయ (Sarvam Maya) డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. స్టార్ హీరో నివిన్ పౌలి (Nivin Pauly) కథానాయకుడిగా నటించగా రియా శిబు (Riya Shibu), అజు వర్గీస్, జనార్దనన్, ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) కీలక పాత్రలు పోషించారు. అఖిల్ సత్యన్ (Akhil Sathyan) దర్శకత్వం వహించాడు. పెద్ద అంచనాలు లేకుండానే క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ రూ. 145 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇంకా రాబడుతోంది కూడా.
కథ విషయానికి వస్తే.. మంచి గిటారిస్టు అయిన హీరో నంబూద్రి యూరప్ వీసా దరఖాస్తు రిజక్ట్ అవడంతో తన సొంతూరుకు వచ్చి తెలిసిన ఓ పూజారి వద్ద సహాయకుడిగా చేరుతాడు. అయితే వారు ఓ రోజు పూజలు చేసి ఒకరి ఇంట్లో ఉన్న దుష్టాత్మను బయటకు వెళ్ళగొడతారు. ఆ తర్వాతి నుంచి అనుకోకుండా ఓ అమ్మాయి ఆత్మ నంబూద్రికి మాత్రమే కనిపిస్తూ మాట్లాడడం చేస్తూ ఉంటుంది. ఆ ఆత్మకు గతం కూడా గుర్తుండకపోవడంతో దానికి డెలులు అని పేరు పెట్టి నంబూద్రి స్నేహం చేస్తుంటాడు. క్రమంగా ఆత్మ మనిషిలా ప్రవరిస్తూ ఇతరులకు కనిపించకుండానే ఆర్డర్లు పెట్టడం, నంబూద్రి వస్తువులు వాడడం చేస్తుండడంతో చుట్టుపక్కలా అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది.
ఆపై.. కొన్నాళ్లకు నంబూద్రి గిటారిస్టుగా సక్సెస్ అవడమే గాక తన తండ్రితో కలిసిపోతాడు. అయితే.. ఓ రోజు తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు. అదే సమయంలో డెలులుకు తన గతం గుర్తుకు రావడం ప్రారంభవుతుంది. ఈ క్రమంలో అసలు డెలులు ఎవరు, తను ఎలా, ఎందుకు చనిపోయింది, చివరకు హీరో ఏం చేశాడనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. ఇప్పుడు ఈ మూవీ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
మంచి ఫీల్‌గుడ్ సినిమా చూడాలనుకునే వారు ఒక సారి ఈ సినిమాను ట్రై చేయవచ్చు. అయితే.. మైండ్‌లో ఎవేవో అంచనాలు పెట్టుకుని చూస్తే సినిమా అసలు ఎక్కదు. ఎలాంటి అంచనాలు లేకుండా క్యాజువల్‌గా చూస్తే సినిమా అందరికీ నచ్చి తీరుతుంది. ఎక్కడా ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు కూడా లేవు. ముఖ్యంగా యూ ట్యూబ్‌లో తెలుగు వారి రివ్యూలు చూడకుండా మూవీ చూడడం బెటర్.