Sardar 2: ‘సర్దార్‌2’.. ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

ABN , Publish Date - Sep 28 , 2026 | 02:06 PM

కార్తి (Karthi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ (sardar 2) డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

కార్తి (Karthi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ (sardar 2) డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన  సినిమా ఇది. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటించగా.. ఎస్.జె.సూర్య, రజిషా విజయన్ కీలక పాత్రల్లో కనిపించారు. సెప్టెంబరు 10న థియేటర్లలో విడుదలైన ‘సర్దార్ 2’కు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్‌ స్పందన లభించలేదు. అయితే థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ సినిమాను ఇంటి నుంచే చూసే అవకాశం ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) ‘సర్దార్ 2’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.అక్టోబరు 1 నుంచి ‘సర్దార్ 2’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిశ్రమ స్పందనను ఎదుర్కొన్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణను సొంతం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.  

Story:
రా ఏజెంట్ విజయ్‌ (కార్తీ) మీద పెద్దంత విశ్వాసంలేని చీఫ్‌ బొమ్మై (ఆషిష్‌ విద్యార్థి) అతన్ని లూప్ లైన్‌లో పెడతాడు. తనలాంటి మరో ఇద్దరి (యోగిబాబు, నిళల్‌గళ్‌ రవి)తో కలిసి విజయ్‌ అప్పటికే కనిపించకుండా పోయిన రా ఏజెంట్ వాల్రస్‌ (అచ్యుత్‌ కుమార్)ను వెతికే పనిలో పడతాడు. ఇంటర్నేషనల్ అండర్ వరల్డ్ డాన్ బ్లాక్‌ డగ్గర్ (ఎస్.జె.సూర్య) మనుషుల చేతిలో చనిపోతూ, విజయ్‌ కు తన దగ్గర ఉన్న ఓ 'కీ'ని ఇచ్చిన వాల్రస్ కన్నుమూస్తాడు. దీనికి కొద్దిరోజుల ముందే అలాంటి మరో 'కీ' చనిపోయే ముందు మరో 'రా' ఏజెంట్‌ (మాళవిక మోహనన్) తన కూతురు ఫైజా (ఆషిష్‌ రంగనాథ్‌)కు ఇస్తుంది. ఇలాంటి ఇంకో 'కీ' డి.ఆర్.డి.వో. ఛీఫ్‌ టైగర్ హరిశ్చంద్ర (బాబు ఆంటోనీ) దగ్గర ఉందని దానిని కూడా సంపాదిస్తే... ఈ దేశాన్ని ఓ పెద్ద విపత్తు నుంచి కాపాడవచ్చని విజయ్‌ భావిస్తాడు. అయితే విజయ్‌ కంటే ముందే బ్లాక్‌ డగ్గర్ ఆ 'కీ'ని సొంతం చేసుకుని, ఈ దేశాన్ని నాశనం చేయడానికి సిద్థమౌతాడు. బ్లాక్‌ డగ్గర్ ను ఎదుర్కొవడం లో విజయ్‌ విఫలమైనప్పుడు ఊహించని విధంగా అతని తండ్రి సర్దార్‌ (కార్తీ) రంగంలోకి దిగుతాడు. ప్రభుత్వం దృష్టిలో చైనాలో చనిపోయిన సర్దార్‌ ఎలా బతికి బయటపడ్డాడు? బ్లాక్ డగ్గర్ సృష్టించబోతున్న మారణ హోమం గురించి సర్దార్ కు ఎలా తెలిసింది? బయో వెపన్ ను నిర్వీర్యం చేయడానికి ఈ తండ్రీ కొడుకులు ఏం చేశారు? అనేది మిగతా కథ.

Updated Date - Sep 28 , 2026 | 02:06 PM