‘భారత్ భాగ్య విధాత’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే

ABN , Publish Date - Aug 08 , 2026 | 01:29 PM

26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘భారత్ భాగ్య విధాత’ (Bharat Bhagya Vidhata) ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘భారత్ భాగ్య విధాత’ (Bharat Bhagya Vidhata) ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగనా రనౌత్‌, గిరిజా ఓక్‌, స్మిత తాంబే తదితరులు నటించిన ఈ చిత్రం ఆగస్టు 14న జీ5లో ప్రత్యేకంగా ప్రీమియర్‌ కానుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మనోజ్‌ తపాడియా దర్శకత్వం వహించిన ఈ సినిమా థ్రిల్లర్‌ డ్రామాగా తెరకెక్కింది. PEN స్టూడియోస్‌, మణికర్ణిక ఫిల్మ్స్‌, పరమహంస్ క్రియేషన్స్‌, యూనోయా ఫిల్మ్స్ LLP, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 

26/11 దాడుల సమయంలో ముంబైలోని కామా, అల్బ్లెస్‌ ఆసుపత్రిలో జరిగిన ఘటనలే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. ఉగ్రవాదులు ఆసుపత్రి ప్రాంగణంలోకి ప్రవేశించిన సమయంలో అక్కడ పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, వార్డ్‌ బాయ్స్‌, క్లీనర్లు, భద్రతా సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోగులను కాపాడేందుకు ప్రయత్నించారు. సాధారణ ఉద్యోగులుగా ఉన్న వారు.. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. తమ ప్రాణాలను రక్షించుకోవడం కంటే రోగుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు, వారి త్యాగం, మానవత్వం, కర్తవ్యనిష్ఠను ‘భారత్ భాగ్య విధాత’లో చూపించనున్నారు. ఇప్పటివరకు 26/11 ముంబై దాడులపై అనేక సినిమాలు వచ్చినప్పటికీ, ఆసుపత్రి సిబ్బంది కోణంలో కథను చెప్పడం ఈ చిత్రానికి ప్రత్యేకతగా నిలవనుంది.  

కంగనా మాట్లాడుతూ.. 26/11 సమయంలో ఉగ్రవాదానికి ఎదురుగా నిలిచిన ఆరోగ్య కార్యకర్తల వెలుగులోకి రాని కథలను ప్రేక్షకులకు చూపించడం తనకు ఎంతో ముఖ్యమని తెలిపారు. వారి ధైర్యం, కర్తవ్యనిష్ఠ, మానవత్వాన్ని ఈ చిత్రం గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. 

Updated Date - Aug 08 , 2026 | 01:31 PM