Jio Hotstar: రేట్లు భారీగా పెంచేసిన.. జియో హాట్‌స్టార్! ఏకంగా ఫ్లాన్‌పై.. 700 పెంపు
ABN , Publish Date - Jan 20 , 2026 | 06:11 PM
నిత్యం నూతన కంటెంట్‌తో అలరిస్తున్న జియో హాట్ స్టార్ ఓటీటీ వీక్షకులకు షాకిచ్చేందుకు సిద్దమయింది.
నిత్యం నూతన కంటెంట్‌తో అలరిస్తున్న జియో హాట్ స్టార్ (Jio Hotstar) ఓటీటీ వీక్షకులకు షాకిచ్చేందుకు సిద్దమయింది. ఇప్పటికే హిందీ సిరీస్‌లు, బ్లాక్ బస్టర్ సినిమాలను, హాలీవుడ్ కంటెంట్‌ను ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ఎదుటకు తీసుకు వస్తున్న ఈ దిగ్గజ ఫ్లాట్‌ఫాం ఏడాది తిరగకుండానే సడన్‌గా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సూపర్ ఫ్లాన్‌పై రూ.200, ప్రీమియం ఫ్లాన్‌పై ఏకంగా రూ.700 వరకు ధరలు పెంచి ఖంగుతినిపించింది. అంతేగాక కొత్తగా మార్పులు, చేర్పులు సైతం చేశారు. కాగా పెంచిన ఈ ధరలు జనవరి 28 నుంచి అమలులోకి రానున్నాయి.
ఇప్పటికే మొబైల్, సూపర్, ప్రీమియం అంటూ మూడు రకాల వేరియంట్లలో క్వార్టర్లీ, ఇయర్లీ ఫ్లాన్‌లుగా అమలు చేసిన జియో ఈ సారి నెట్‌ఫ్లిక్స్‌ను ఫాలో అవుతూ కొత్తగా నెల వారి ఫ్లాన్‌లను ప్రవేశ పెట్టింది. అంతేగాక వాటి ధరలను కూడా సవరించింది. గతంలో మొబైల్ (Mobile) ఫ్లాన్ మూడు నెలలకు రూ.149, సంవత్సరానికి రూ.499 ఉండగా వాటిని అలానే కంటిన్యూ చేస్తూ రూ.79 ధరతో నెల వారీ ప్యాక్‌ను కొత్తగా తీసుకువచ్చారు. అయితే ఈ మొబైల్ ఫ్లాన్‌లో హాలీవుడ్ మూవీస్ అందుబాటులో ఉండవు. యాడ్స్ ఎక్కువగా ఉంటాయి.
ఇక సూపర్ (Super) ఫ్లాన్.. గతంలో మూడు నెలలకు రూ.299, ఏడాదికి రూ.899 ఉండగా ఇప్పుడు వాటిని రూ.349, రూ.1099లకు పెంచారు. నూతనంగా రూ. 149తో నెలవారీ ఫ్లాన్ తెచ్చారు. అయితే ఈ ఫ్లాన్ ఏక కాలంలో రెండు డివైస్‌ల వరకు పని చేయనుండగా, యాడ్స్ భారీగానే వస్తాయి. హాలీవుడ్ కంటెంట్ లభిస్తుంది. ఇక ప్రీమియం (Premium) ఫ్లాన్ గతంలో మూడు నెలలకు రూ.499, ఏడాదికి రూ.1499 ఉండగా ఇప్పుడు వాటిని రూ.699, రూ.2199గా మార్చారు. కొత్తగా రూ.299తో మంత్లీ ఫ్లాన్ తీసుకు వచ్చారు. ఈ ఫ్లాన్ 4 డివైస్‌లలో పని చేయనుండగా ఎలాంటి యాడ్స్ ఉండవు. అయితే.. మరో రెండు నెలలో ఐపీఎల్ ప్రారంభం కానుండగా ఇప్పుడు ధరలు పెంచడంపై క్రీడాభిమానులు మండి పడుతున్నారు.