OTT: ఈ ఓటీటీలు మాకొద్దు.. చూసే సినిమా కన్నా వచ్చే యాడ్స్ ఎక్కువ!
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:09 PM
ప్రతి మనిషికి తిండి, బట్ట, ఇల్లుతో పాటు ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తప్పని సరి అనే పరిస్థితి వచ్చేసింది.
సగటు సినీ ప్రేక్షకుడికి మంచి వినోదాన్ని అందించడం కోసం ఓటీటీ (OTT) లు నిత్యం పొటీలు పడుతూ ఎప్పటికప్పడు డిఫరెంట్ కంటెంట్‌తో అలరిస్తూ వస్తున్నాయి. దీంతో ప్రతి ప్రేక్షకుడికి ఓటీటీ అనేది నిత్యావసర వినోదంగా మారిపోయింది. ఈ క్రమంలో ప్రతి మనిషికి తిండి, బట్ట, ఇల్లుతో పాటు ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తప్పని సరి అనే పరిస్థితి వచ్చేసింది. పొద్దస్తమానం పని చేసి ఇంటికి వచ్చిన వారికి, నేటి జన్ జీ కీ డిజిటల్ స్ట్రీమింగ్ జీవితంలో ఓ భాగమైంది. రోజుకు కనీసం ఒక్క సారైనా ఓటీటీ కంటెంట్ ను చూసి తీరాల్సిందే అనేంతగా ప్రజలు అడిక్ట్ అయ్యారు, అవుతున్నారు.
ముఖ్యంగా మన తెలుగునాట అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జియో హాట్ స్టార్ (Jio Hotstar) ఓటీటీ విషయంలో ముందుండగా ఇటీవల అనుహ్యంగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) స్పీడు పెంచి వీటన్నింటిని తోసి వేసి ఫస్ట్ ఫ్లేస్‌లోకి వచ్చేసింది. కొత్త సినిమా అంటే నెట్‌ఫ్లిక్స్ అనేలా పేరు తెచ్చుకుంది. అయితే దీని సబ్ స్క్రిప్షన్ మిగతా వాటికన్నా కాస్త ఎక్కువ కావడంతో ఇంకా అందరికీ అందుబాటులో లేదు. కానీ తెలుగు కంటెంట్‌ను మాత్రం భారీగా అందిస్తోంది. దీనికి పోటీగా ఉన్న ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్, జీ 5 (Zee5) వంటి దిగ్గజ ఓటీటీలూ మంచి పోటీనే ఇస్తున్నాయి. కొత్త, విభిన్న కంటెంట్ కోసం గట్టిగానే ఖర్చు చేస్తున్నాయి కూడా. ఏడాది క్రితం జియో సంస్థ హాట్ స్టార్‌ను టేకోవర్ చేసుకున్నాక కంటెంట్ రెండింతలు కాగా, విదేశీ కంటెంట్ కూడా భారీగా వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గతంలోనే సబ్ స్క్రిప్షన్ చార్జీలు పెంచిన జియో మరోసారి ధరలను పెంచి వీక్షకులకు షాకిచ్చింది.
అయితే... ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్ (Sony LIV), లయన్ గేట్స్ వంటి ఓటీటీలు ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్లు ఇవ్వకుండా వీక్షకులు, సబ్ స్కైబర్ల డబ్బుకు న్యాయం చేస్తూ వారికి పరిపూర్ణమైన వినోదాన్ని ఇవ్వడంతో పాటు విలువైన సమయాన్ని సేవ్ చేస్తున్నాయి. కానీ జియో హాట్ స్టార్, జీ 5, ఆహా , అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రధాన ఓటీటీలు మాత్రం సబ్ స్కైబర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. మధ్య తరగతి ప్రజలు అధికంగా ఉపయోగించే మొబైల్, సూపర్, ఇంకా బేస్ ప్లాన్స్ ఉన్న వారు ఏదైనా కంటెంట్ చూస్తున్న సమయంలో యాడ్స్‌ను రెట్టింపు స్థాయిలో ఇస్తుండడంతో వారికి విసుగు కలుగుతోంది. అవి వచ్చినప్పుడు సినిమా మధ్యలో యాడ్స్ వస్తున్నాయా లేక యాడ్స్ మధ్యలో సినిమా వస్తుందా అనే భావనకు లోనవుతున్నారు. వీటికన్నా టీవీ నయం గదరా నాయనా అంటూ నిట్టూర్చుతున్నారు. ఒక్కోసారి అసలు ఈ హాట్ స్టార్, జీ 5, ఆహా సబ్ స్క్రిప్షన్ ఎందుకు తీసుకున్నామా? అని తల పట్టుకుంటున్నారు.

మరోవైపు... ఓ పండగో, పబ్బమో, సెలవో వచ్చింది కదా అని ఇంట్లో ఆడవాళ్లు, పెద్దవాళ్లు, పిల్లలు కలిసి 'టూరిస్టు ఫ్యామిలీ' లాంటి సినిమాను చూద్దామని హాట్ స్టారో, ఆహానో ఆన్ చేసి చూస్తుంటే మూవీ మధ్యలో సడన్‌గా కండోమ్, పాన్ మసాలా వంటి యాడ్స్‌తో పాటు తమ వద్ద ఉన్న బోల్డ్ సినిమాలు, సిరీస్‌ల క్లిప్పులు పదే పదే వేస్తూ వీటిని కూడా చూసేయండి అని బెదర గొడుతున్నారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులు తెల్లముఖం వేస్తున్నారు. కొంపదీసి పిల్లలు ఎవరైనా వాటిని చూసి 'అదేం సినిమా, అదేం యాడ్' అని అడిగితే ఏం చెప్పాలో దిక్కుతోచని అయోమయ పరిస్థితికి లోనవుతున్నారు.
దీంతో 'ఇదెక్కడి ఖర్మ రా మనకు... మనం ఇప్పుడు చూసే సినిమా ఏంటి, వచ్చే యాడ్స్ ఏంటి?' అని అందరి ముందు ఓటీటీలు ఆన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఒక వేళ ఆన్ చేసినా ఏ నిమిషంలో.. ఎలాంటి యాడ్ చూడాల్సి వస్తుందో అని భయం, భయంగా గడుపుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలా మందికి ఎదురవుతున్నాయి. దీంతో వీటిపై సదరు ఓటీటీ సంస్థలు దృష్టి సారించాలని, యాడ్స్ ఒకటి కాకుంటే మూడు నాలుగు వేసుకున్నా ఇబ్బంది లేదు కానీ సబ్ స్క్రైబర్స్ ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో, దానికి రిలేటెడ్ గా ఉన్న యాడ్స్ మాత్రమే వేస్తే బావుంటుందని సూచిస్తున్నారు. కుటుంబంతో కలిసి సినిమాలు చూసే వారికి అప్పుడే కాస్త ప్రశాంతత, తృప్తి ఉంటుందని లేకుంటే సదరు వీక్షకులు ఓటీటీలకు గుడ్ బై చెప్పి ప్రత్యామ్నాయాల వైపు మళ్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ కారణంగానే ఈ మధ్య వీటి సబ్‌స్క్రిప్షన్లు తీసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుండగా దాని స్థానంలో అనేక మంది థర్ట్ పార్టీ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారని తెలుస్తోంది. అక్కడ తమకు కావాల్సిన సినిమాలు, సిరీస్‌లు డౌన్‌లోడ్ చేసుకుని టీవీకి కనెక్ట్ చేసుకుని హాయిగా ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్లు లేకుండా చూసేస్తున్నారు. మరికొంతమంది డైరెక్ట్ అన్‌లైన్‌లోనే చూసి మమా అనిపిస్తున్నారు. ఇక భవిష్యత్తులోనైనా ఈ ఓటీటీల తీరు మారకుంటే మరింత మంది ఈ ఆన్‌లైన్ దారిలోకి వచ్చే అవకాశం లేక పోలేదు.