Ayalaan: ఎట్టకేలకు.. ఓటీటీకి అయలాన్! రెండేండ్ల తర్వాత.. సడన్ సర్‌ఫ్రైజ్
ABN , Publish Date - Jan 07 , 2026 | 09:35 AM
రెండేండ్ల పాటు రిలీజ్‌కు నోచుకోక మూలన పడి ఎట్టకేలకు సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి ఆశ్చర్య పరిచింది అయలాన్ చిత్రం.
శివ కార్తికేయన్ (Sivakarthikeyan), రకుల్ ప్రీత్ (Rakul Preet Singh) జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అయలాన్ (Ayalaan). 2023 దీపావళికి విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. సుమారు రూ. 60 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టి శివ కార్తీకేయన్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ చిత్రంగా నిలిచింది. అయితే తమిళంతో పాటు తెలుగులోనూ థియేటర్లలోనూ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అది కాస్త రెండేండ్ల పాటు రిలీజ్‌కు నోచుకోక మూలన పడింది. అయితే.. ఎట్టకేలకు ఈ సినిమా సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి ఆశ్చర్య పరిచింది.
కథ విషయానికి వస్తే.. సేంద్రీయ వ్యవసాయం మాత్రమే చేసే హీరోకు నష్టాలు తప్ప లాభాలనే మాట ఉండదు. ఈ నేపథ్యంలో హీరో తల్లి తన కొడుకుని ఏదైనా ఉద్యోగం చేసి బతకాలని సిటీకి పంపుతుంది. మరోవైపు ఆర్యన్ అనే సైంటిస్టు తన వద్ద ఉన్న స్పార్క్ అనే గ్రహ శకలంతో ఆఫ్రికాలో ఫ్యూయల్‌కు ప్రత్యామ్నయంగా నోవా గ్యాస్‌ను తయారు చేసే పనిలో ఉండగా అది విఫలమై చాలా మంది చనిపోతారు. దాంతో అతను ఇండియాకు వచ్చి రహస్యంగా ప్రయోగాలు మొదలు పెడతాడు. అయితే ఆర్యన్ వద్ద ఉన్న స్పార్క్ కోసం టట్టు అనే ఎలియన్ ఓ గ్రహం నుంచి వచ్చి అనుకోకుండా హీరో వద్దకు చేరుతుంది. ఈ క్రమంలో ఎలియన్ హీరో గ్యాంగ్‌తో ఎందుకు చేరింది, ఆర్యన్ టీం ఎలియన్ను ఎందుకు టార్గెట్ చేశారు? ఆర్యన్ ప్రయోగం ఏ పరిస్థితులకు దారి తీసింది? హీరో ఎలా అడ్డుకున్నాడనేదే ఈ మూవీ కథ.
ఇప్పటికే... గతంలో మన ముందుకు వచ్చిన కోయి మిల్ గయా సినిమా ఇలాంటి కథే అయినా.. అయలాన్ మాత్రం దానికి భిన్నంగా ఫాంటసీ జోడించి, ఎక్కడా ఎలాంటి బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్‌గా తీర్చి దిద్దారు. పిల్లలకైతే తెగ నచ్చుతుంది. ఈ సినిమా కోసం చాలామంది తెలుగు వారు ఎదురు చూస్తుండగా ఈ మధ్యే ఈ మూవీని తెలుగులో టీవీల్లో ప్రసారం చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు కూడా వస్తుందనుకుంటే ఎలాంటి అప్డేట్ లేక నిరాశ చెందారు. సడన్‌గా బుధవారం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఆహా (Aha Video) ఓటీటీ (OTT)లో స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చి సర్‌ఫ్రైజ్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు... తమిళనాట పొంగల్ కానుకగా శివ కార్తికేయన్ 'పరాశక్తి' 10న విడుదలవుతోంది. కానీ అది తెలుగులో రావడంలేదు. సో... తెలుగులోని శివ కార్తికేయన్ అభిమానులు ఈ పండక్కి 'అయలాన్' చూసి ఆనందించాల్సిందే!