మీరు మెచ్చిన జంట మరోసారి దరువేయబోతోంది.. మీరు రెడీనా..
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:14 PM
'కోర్ట్’ సినిమాతో హిట్ పెయిర్ గా నిలిచారు హర్ష్ రోషన్ (Harsh Roshan), శ్రీదేవి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ‘బ్యాండ్ మేళం’ (Band melam).
'కోర్ట్’ సినిమాతో హిట్ పెయిర్ గా నిలిచారు హర్ష్ రోషన్ (Harsh Roshan), శ్రీదేవి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ‘బ్యాండ్ మేళం’ (Band melam). సతీశ్ జివ్వాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రచయిత కోన వెంకట్ నిర్మించారు. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈనెల 24 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని 'జీ 5’ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కొత్త పోస్టర్ తో ‘మీరు మెచ్చిన జంట మరోసారి దరువేయబోతోంది. మీరు సిద్ధమా?’ అని క్యాప్షన్ పెట్టింది.
కథ:
తెలంగాణలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బావా మరదళ్ళుగా ఒకే రోజున పుట్టిన జంట యాదగిరి (హర్ష్ రోషన్), రాజీ (శ్రీదేవి). చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగిన వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. పెద్దయ్యాక పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ గిరికి చదువు ఎక్కదు. ఓ మ్యూజిక్ బ్యాండ్ క్రియేట్ చేసి కాలం గడుపుతూ ఉంటాడు. రాజీ బాగా చదివి టెన్త్ క్లాస్ లో జిల్లాకే ఫస్ట్ వస్తుంది. పైచదువు కోసం రాజీ సిటీకి వెళ్ళడంతో ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది. గిరి ఊళ్లోనే స్నేహితులతో బ్యాండ్ కొడుతూ ఓ మ్యూజిక్ సంస్థ నుంచి ఆల్బమ్ చేయమని ఆఫర్ రావడంతో నానా తిప్పలు పడి స్టూడియో పెడతాడు. అయితే కొబ్బరికాయ కొట్టిన రోజే స్టూడియో కాలిపోతుంది. అంతలోనే మరదలు రాజీకి పెళ్లి ఏర్పాటు చేస్తాడు తండ్రి సాయన్న (సాయికుమార్). పెళ్లి టైమ్ కి రాజీ మిస్ అవుతుంది. దాంతో ఆమె లేచిపోయిందనే టాక్ మొదలవుతుంది. అసలు రాజీ పారిపోవడానికి కారణం ఏంటి? గిరి, రాజీ కథ కంచికి చేరిందా? లేదా? గిరి కెరీర్ బాగుపడిందా? అన్నదే కథ.