Mayukha: ఓటీటీలోకి వచ్చేసిన ‘మయూఖ’!
ABN , Publish Date - Nov 20 , 2026 | 08:21 PM
భారీ బడ్జెట్, స్టార్ హీరోలు ఉంటేనే సినిమా విజయం సాధిస్తుందనుకోవడం పొరపాటే.
భారీ బడ్జెట్, స్టార్ హీరోలు ఉంటేనే సినిమా విజయం సాధిస్తుందనుకోవడం పొరపాటే. బలమైన కథ, కొత్త తరహా కథనం ఉంటే చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవచ్చని నిరూపించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ కోవలోనే గుర్తింపు తెచ్చుకున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘మయూఖ’. పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి శ్రీ తేజ్ SK దర్శకత్వం వహించారు. శశిధర్ నల్ల, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సినిమా తాజాగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో మంచి స్పందనతో పాటు న్యూయార్క్, కేన్స్ అంతర్జాతీయ వేదికలపై అవార్డుల గుర్తింపు పొందిన ఈ చిత్రం డిజిటల్ విడుదలతో మరోసారి వార్తల్లో నిలిచింది. నవంబర్ 20 అర్ధరాత్రి 12 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు వెర్షన్ ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 23 నుంచి తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వేదికలపై అందుబాటులోకి రానుంది.
ఈ సినిమా కథనం గురించి దర్శకుడు శ్రీ తేజ్ SK ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తొలి భాగం నెమ్మదిగా సాగుతూ పాత్రలు, కథా నేపథ్యాన్ని పరిచయం చేస్తుందని, ప్రీ ఇంటర్వెల్ నుంచి అసలైన ఉత్కంఠ మొదలవుతుందని తెలిపారు. రెండో భాగంలో అనూహ్యమైన మలుపులు, ఇంటెన్స్ థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. విజువల్ పరంగానూ ఈ సినిమా ప్రత్యేకతను చాటుకుంది. సాధారణ లైటింగ్‌కు భిన్నంగా మోనోక్రోమాటిక్ లైటింగ్ పద్ధతిని ఉపయోగించి ప్రత్యేకమైన విజువల్ అనుభూతిని అందించేందుకు ప్రయత్నించారు. స్పానిష్, హాలీవుడ్, కొరియన్ సినిమాల నుంచి స్ఫూర్తి పొందినట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ సినిమాను మధ్యలో ఆపకుండా ఒకే సిట్టింగ్‌లో పూర్తిగా చూడాలని ప్రేక్షకులకు చెబుతున్నారు. కొత్త తరహా కథనాలు, సైకలాజికల్ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి ‘మయూఖ’ మంచి సినిమా అని చెప్పారు.