స‌డ‌న్‌గా ఓటీటీకి వ‌చ్చేసిన ‘పళ్ల బురుసు’

ABN , Publish Date - Sep 02 , 2026 | 11:08 AM

ఇటీవ‌ల థియేట‌ర్లకు వ‌చ్చిన అన్న‌పూర్ణ‌ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి షాక్ ఇచ్చింది.

Pallaburusu

తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ‘పళ్ల బురుసు’ (Palla Burusu) సినిమా స‌డ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి వ్యూవర్స్ కు షాక్ ఇచ్చింది. 'బలగం' సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి, సుజాత కీలక పాత్రల్లో న‌టించ‌గా ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. అయితే ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక పోయింది.

కథ విష‌యానికి వ‌స్తే.. తెలంగాణలోని పల్లెలో శంభ అనే వృద్థుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు, కూతురు వేరే వేరే ఊళ్ళలో స్థిర‌ప‌డి తండ్రి బాగోగులు అంతగా పట్టించుకోరు. తను పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వేప పుల్ల స్థానంలో టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తారు. కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)ని టూత్ బ్రష్ (పళ్ల బురుసు), మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. సొంత సమస్యల్లో బిజీగా ఉన్న తిరుపతి, తండ్రి మాటను అంతగా పట్టించుకోడు. కొద్ది రోజులకే కూతురు పెళ్లి ఖాయం చేసుకుని కనీసం తండ్రిని పిలవడు. ఇది గమనించిన శంభ లోలోపల కుమిలి పోలీసులను ఆశ్రయిస్తాడు. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టు మెట్లు ఎక్కుతాడు. అసలు తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? తనకున్న ఎకరం పొలంలో తన సమాధిని తానే ఎందుకు సిద్థం చేసుకున్నాడు? చివరకు ఏం జరిగింది? అన్నదే కథ.

వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో చూపిస్తూ సాగే ఈ క‌థలో భావోద్వేగాలు ఆశించినంత‌ బ‌లంగా లేవు. కానీ శంభా తన సమాధి తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం గుండెను బరువెక్కిస్తాయి. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ప‌ల్లె సినిమాలను ఇష్ట‌ప‌డే వారు ఈ చిత్రంపై ఓ లుక్ వేయ‌వ‌చ్చు.

Updated Date - Sep 02 , 2026 | 01:29 PM