Akhanda 2: ఓటీటీ తాండవం ఎప్పుడంటే..
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:56 PM
బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా రూపొందిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘అఖండ2: తాండవం’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా రూపొందిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘అఖండ2: తాండవం’ (Akhanda 2: Thaandavam). సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా తదితరులు నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరులో విడుదలై మిశ్రమ స్పందనకే పరిమితమయింది. అఘోరగా బాలకృష్ణ నటన, బోయపాటి టేకింగ్, సనాతన ధర్మం ప్రాముఖ్యతను తెలియజేస్తూ తీర్చిదిద్దిన సన్నివేశాలు అలరించాయి. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (netflix) స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ పోస్ట్ పెట్టింది.
కథేమిటంటే...
'అఖండ' సినిమాకు ఎక్కడ శుభం కార్డు పడిందో అక్కడే ఈ కథ మొదలైంది. అరి వర్గాలను హతమార్చిన అఖండ రుద్ర (బాలకృష్ణ) అష్ట లింగ పీఠంలో తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. ఇక్కడ మురళీకృష్ణ (బాలకృష్ణ Balakrishna) ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవ చేస్తుంటాడు. అతని భార్య శరణ్య కన్నుమూయడంతో కూతురు జనని (హర్షాలీ మల్హోత్ర Harshali Malhotra)ని కంటికి రెప్పలా కాపాడుతూ, సైంటిస్ట్ ను చేస్తాడు. ఈ దేశ హితం కోసం ఆమె టీమ్ హిమాచల్ ప్రదేశ్ లో పని చేస్తుంటుంది. వారంతా ఆర్మీ ఆఫీసర్ అర్చన (సంయుక్త Samyuktha) సంరక్షణలో ఉంటారు. ఇదిలా ఉంటే... పీ.ఎం. పీఠంపై కన్నేసిన ప్రతిపక్ష నేత అజిత్ ఠాకూర్ (కబీర్ దుహాన్ సింగ్)... చైనా జనరల్ జంగ్లీ (సాంగ్య Sangay Tsheltrim)తో చేతులు కలుపుతాడు. ఈ దేశాన్ని నాశనం చేయాలంటే ప్రజలలో ఉన్న దైవభక్తిని తొలగించాలని, దేవుడు సైతం తమను కాపాడలేడనే భావనకు వారిని లోను చేయాలని అజిత్ ఠాకూర్ ప్రయత్నిస్తాడు. అందుకు మహా కుంభమేళ ను అనువుగా వాడుకుంటాడు. పవిత్ర గంగాజలాన్ని కలుషితం చేసి తద్వారా ప్రజలు వైరస్ బారిన పడేలా పన్నాగం పన్నుతాడు. ప్రతిపక్ష నేత, చైనా జనరల్ చేసిన ప్రయత్నాలను అఖండ రుద్ర ఎలా అడ్డుకున్నాడు? సనాతన ధర్మాన్ని తుడిచి వేయాలని వారు చేసిన కుతంత్రాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? వైరస్ ను రూపుమాపడం కోసం జనని టీమ్ తయారు చేసిన వాక్సిన్ ను నాశనం చేయాలనుకున్న వారి కుట్రలను ఎలా భగ్నం చేశాడు? అనేది మిగతా కథ