Sobhita Dhulipala: సమంత దారిలో శోభిత.. లీడ్ రోల్‌లో వెబ్ సిరీస్
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:44 PM
అమెజాన్ ప్రైమ్ లో నాగచైతన్య నటించిన 'ధూత' వెబ్ సీరిస్ కు మంచి ఆదరణ లభించింది. దాంతో ఇప్పుడు శోభిత ధూళిపాల నటించిన 'చీకటిలో...' సినిమాను డైరెక్ట్ గా స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
ప్రముఖ నటి, నాగచైతన్య (Naga Chaitanya) భార్య శోభిత ధూళిపాల (Shobhita Dhulipala) నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమా 'చీకటిలో...' (Cheekatilo). ఈ సినిమాలో శోభిత ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్ సంధ్య పాత్రను పోషిస్తోంది. హైదరాబాద్ నేపథ్యంలో ఈ క్రైమ్ సస్పెన్స్ మూవీ కథ సాగబోతోంది. నగరంలోని చీకటి రహస్యాలను వెలికితేసే పాత్రను ఆమె చేస్తోంది. శరణ్ కొప్పిశెట్టి (Sharan Kopishetty) దర్శకత్వంలో ఈ సినిమాను డి. సురేశ్ బాబు (Suresh Babu) నిర్మించగా చంద్ర పెమ్మరాజు రచనా సహకారం అందించారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రను విశ్వదేవ్ రాచకొండ (Vishwadev Rachakonda) పోషించాడు. అలానే వెంట చైతన్య విశా లక్ష్మీ, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ ఇందులో ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ తెలుగు ఒరిజినల్ సినిమా ప్రైమ్ వీడియోలో జనవరి 23న ప్రీమియర్ కానుంది.
తన వద్ద శిక్షణ పొందుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందితే న్యాయం కోసం సంధ్య ఎలాంటి పోరాటం చేసిందన్నది ఇందులోని ప్రధానాంశం. ఆ క్రమంలో దారుణమైన నేరాలను ఆమె వెలికి తీస్తుంది. ఈ సందర్భంగా ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ఒరిజినల్స్ నిఖిల్ మధోక్ మాట్లాడుతూ, 'దక్షిణభారత దేశంలో ఒరిజినల్స్ ను విస్తరించాలనే ఆశయం కోసం పనిచేస్తున్నాం. సస్పెన్స్ థ్రిల్లర్స్ చక్కని జనాదరణ పొందుతుండగా, భావోద్వేగ అవగాహన ఉన్న కథనాలను అందించడంపై మేము దృష్టి సారిస్తున్నాం. నాగ చైతన్య నటించిన మా తెలుగు ఒరిజినల్ సీరీస్ 'ధూత' ప్రేక్షకులలో ఎక్కువగా ఆదరణ పొందింది. శోభిత నటించిన 'చీకటిలో...' సినిమా కూడా అలాగే ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు.
నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ, 'భావోద్వేగాలు నిండిన సస్పెన్స్ డ్రామా ఇది. చీకటిని ఎదుర్కోవడానికి, నిజాలు మాట్లాడటానికి కావలసిన ధైర్యాన్ని ఇది అన్వేషిస్తుంది. ఈనాటి సమాజంలో ఇది మనకెంతో అవసరం. ఈ అమెజాన్ ఒరిజినల్ కోసం ప్రైమ్ వీడియోతో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది. ఈ సినిమా దీర్ఘకాలంగా కొనసాగుతున్న మా భాగస్వామ్యములో మరొక మైలురాయి. ప్రేక్షకులు ఈ క్రైమ్ థ్రిల్లర్ ను చూసి ఆనందిస్తారని మేము ఆశిస్తున్నామం' అని చెప్పారు. ఇదిలాఉంటే గతంలో సమంత కూడా వైపు సినిమాలు చేస్తూనే ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ హనీ బన్నీ సిరీస్‌లతో అలరించింది. ఇప్పుడు శోభిత సైతం ఫస్ట్ టైం లీడ్ రోల్‌లో అదీ కూడా తెలుగులో ఎంట్రీ ఇస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.