రూ.2,000 కోట్లతో.. 3 కొత్త OTTలు
ABN , Publish Date - Sep 09 , 2026 | 10:37 AM
దేశవ్యాప్తంగా వినోద రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా FTPCI ముందుకు సాగుతోందని ఆ సంస్థ అధ్యక్షుడు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా వినోద రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్టీపీసీ) (FTPCI) ముందుకు సాగుతోందని ఆ సంస్థ అధ్యక్షుడు చైతన్యా జంగా, ప్రధాన కార్యదర్శి విజయవర్మ పాకలపాటి వెల్లడించారు.
హైదరాబాద్ బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నోయిడా ఫిలిం సిటీ ఎండీ సందీప్ మార్వా, లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్ జితేంద్ర మతలానితో కలిసి వారు ఓటీటీ (OTT) ప్లాట్ఫామ్ బ్రోచర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పన, కొత్త ప్రతిభకు వేదికలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. తమ సంస్థ తరపున రూ.2,000 కోట్ల పెట్టుబడులతో 3 నూతన హిందీ ఫ్లిక్స్, అస్టారా, యూనిఎంట్ పేర్లతో మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ డిజిటల్ వేదికలు దేశీయంగా వినోద రంగానికి కొత్త ఊపును తీసుకురావడమే కాకుండా, వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ కంటెంట్‌ను మరింత విస్తృత ప్రేక్షకులకు చేరవేయడం, కొత్త సాంకేతికతను ప్రోత్సహించడం, స్వతంత్ర కంటెంట్ సృష్టికర్తలకు అవకాశాలు కల్పించడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు వివరించారు.