Jyothi: యాభై ఏళ్ళ 'జ్యోతి'.. రాఘవేంద్రునికి అసలైన ఖ్యాతి
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:53 PM
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రెండవ సినిమా 'జ్యోతి. జూన్ 4న 'జ్యోతి' యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. అర్ధ శతాబ్దం క్రితం 'జ్యోతి' ఎలా అలరించిందో గుర్తు చేసుకుందాం.
శతాధిక చిత్రాల దర్శకునిగానూ, అత్యధిక సక్సెస్ రేట్ చూసిన డైరెక్టర్ గానూ కె.రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) నిలిచారు. ఆయన దర్శకత్వంలో తొలి చిత్రం 'బాబు' అంతగా అలరించలేదు. రెండో సినిమాగా 'జ్యోతి'ని రూపొందించారు. ఆ రోజుల్లో కంట్రోల్ బడ్జెట్ తో రూపొందిన జ్యోతి (Jyothi) మంచి విజయం సాధించింది. 1976 జూన్ 4వ తేదీన రిలీజైన 'జ్యోతి' చిత్రాన్ని క్రాంతికుమార్ (Kranthi Kumar) నిర్మించారు. జయసుధ (Jayasudha) టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రంలో గుమ్మడి, మురళీమోహన్ (Murali Mohan), సత్యనారాయణ, రావు గోపాలరావు, ఛాయాదేవి, గిరిబాబు, ఫటాఫట్ జయలక్ష్మి నటించారు. ఈ చిత్రానికి సి.ఆనందరామం రాసిన 'మమతల కోవెల' నవల ఆధారం. కాగా, అంతకు ముందు హిందీలో రూపొందిన 'మిలి' చిత్రానికి ఈ మూవీకి పోలిక ఉందని ప్రచారం సాగింది. కేవలం హీరోయిన్ ఓ వ్యాధితో పిన్నవయసులోనే కన్నుమూసే అంశం తప్ప 'జ్యోతి'కి, 'మిలి'తో సంబంధం లేదు. ఈ చిత్రంలోని కథలోని వైవిధ్యం జనాన్ని భలేగా ఆకట్టుకుంది.
వైవిధ్యమైన కథ.. 'జ్యోతి'
'జ్యోతి'లోని కథాంశం ఏమిటంటే - జ్యోతి తన బావను ఎంతగానో ప్రేమించి పెళ్ళాడాలనుకుంటుంది. అయితే ఆమెకు ఓ జబ్బు ఉంటుంది. ఇక ఆమె ఎక్కువ రోజులు జీవించదని తెలుస్తుంది. తాను మరణిస్తే బావ ఏమవుతాడో అని భావిస్తుంది. ఆ సమయంలోనే ఆసుపత్రిలో పరిచయమైన ఓ అక్క తన కథ చెప్పి కన్నుమూస్తుంది. ఆ అక్క కుటుంబాన్ని నిలపడం కోసం ముసలివాడైన ఆమె భర్తను కోరి మరీ పెళ్ళాడుతుంది జ్యోతి. ఆయన కూతురిని చక్కదిద్ది తన బావకు నచ్చచెప్పి ఆ అమ్మాయితో పెళ్ళి చేసి కన్నుమూస్తుంది జ్యోతి. ఈ కథను కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సత్యానంద్ సంభాషణలు ప్రాణం పోశాయి. చక్రవర్తి స్వరకల్పన చేయగా ఆచార్య ఆత్రేయ పాటలు రాశారు.
జయసుధకు ఎంతో గుర్తింపు..!
'జ్యోతి' సినిమా రిలీజ్ సమయానికి నాటి మేటి హీరోల చిత్రాలు విజయ విహారం చేస్తున్నాయి. అయినప్పటికీ 'జ్యోతి' మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శతదినోత్సవం జరుపుకుంది 'జ్యోతి'.ఈ చిత్రం ద్వారా జయసుధ ఉత్తమ నటిగా 'ఫిలిమ్ ఫేర్' అవార్డును అందుకున్నారు. అప్పటికి ఆమె వయసు 18 ఏళ్ళు దాటి కొన్ని నెలలే అయింది. అంత పిన్నవయసులో ఫిలిమ్ ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ గా జయసుధ నిలవడం విశేషం. ఈ నాటికీ తెలుగు కథానాయికల్లో పిన్నవయసులో ఫిలిమ్ ఫేర్ అవార్డు అందుకున్న నటిగా జయసుధనే నిలచి ఉన్నారు. అప్పటి దాకా సెకండ్ హీరోయిన్ కేరెక్టర్స్ తో సాగిన జయసుధ 'జ్యోతి'తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయారు. ఏది ఏమైనా నటిగా జయసుధకు, డైరెక్టర్ గా రాఘవేంద్రరావుకు 'జ్యోతి' ఓ మరపురాని చిత్రంగా నిలచింది.