40 సంవత్సరాల.. 'స్వాతిముత్యం'
ABN , Publish Date - Mar 13 , 2026 | 02:28 PM
కమల్ హాసన్, రాధిక జంటగా నటించిన 'స్వాతి ముత్యం' సినిమా విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తయ్యింది. 'సాగర సంగమం' తర్వాత కమల్ హాసన్, కె. విశ్వనాథ్, ఏడిద నాగేశ్వరరావు కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'స్వాతి ముత్యం'.
మహానటుడు కమల్ హాసన్ తో కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించిన రెండో సినిమా 'స్వాతి ముత్యం'. మార్చి 13తో 'స్వాతిముత్యం' 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం.
అంతకు ముందు కమల్ హాసన్ హీరోగా 'సాగర సంగమం' (Sagara Sangamam) తెరకెక్కించి ఘనవిజయం సాధించారు కె.విశ్వనాథ్ (K. Vishwanath). ఆ చిత్రాన్ని నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు (Edida Nageswara Rao) నిర్మాతగానే 'స్వాతి ముత్యం' (Swanthi Mutyam) రూపొందింది. 1986 మార్చి 13వ తేదీన విడుదలైన 'స్వాతిముత్యం' చిత్రంలో కమల్ హాసన్ (Kamal Hussan) జోడీగా రాధిక (Radhika) నటించారు. ఈ చిత్రానికి ఇళయరాజా (Ilayaraja) స్వరకల్పన చేయగా, ఆచార్య ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి, సీతారామశాస్త్రి పాటలు పలికించారు. ఈ సినిమా తెలుగునేలపైనే కాదు, కర్ణాటక, తమిళనాట కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాను తమిళంలో 'సిప్పిక్కుళ్ ముత్తు' పేరుతో డబ్ చేశారు. కన్నడనాట తెలుగు సినిమానే ఘనవిజయం సాధించడం విశేషం.
బుద్ధిమాంద్యం ఉన్నవారికి సైతం మనసుంటుందని, అది మంచినే ప్రేరేపిస్తుందని చాటుతూ 'స్వాతిముత్యం' రూపొందింది. ఐదేళ్ళ బాబు ఉన్న లలిత అనే విడోను శివయ్య అనే అమాయకుడు అభిమానిస్తాడు. సీతారాముల కళ్యాణం సాగుతూ ఉండగా, లలిత మెడలో శివయ్య తాళి కడతాడు. తరువాత అమాయకుడైన భర్త, ఐదేళ్ళ బాబుతో లలిత పయనం సాగుతుంది. శివయ్య ద్వారా కూడా లలితకు పిల్లలు కలుగుతారు. శివయ్య భార్యమరణంతో ఒంటరి జీవితం గడుపుతూంటాడు. పిల్లలు వచ్చి ఆయనను తమతో తీసుకువెళ్ళడంతో కథ ముగుస్తుంది. కథను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. కమల్ హాసన్, రాధిక అభినయం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ అని చెప్పవచ్చు. ఇందులో బాలనటునిగా నటించిన మాస్టర్ కార్తిక్ సైతం మంచి మార్కులు సంపాదించారు.

'స్వాతి ముత్యం' చిత్రానికి ఎమ్. వి. రఘు సినిమాటోగ్రఫి మరో ఎస్సెట్. ఈ చిత్రంలో 'వటపత్రశాయికి.' అన్న పాటను సి.నారాయణ రెడ్డి రాశారు. ఆ పాట మరో వర్షన్ ను సీతారామశాస్త్రితో రాయించారు. అలా 'సిరివెన్నెల'కంటే ముందుగానే సీతారామశాస్త్రి పాట ఇందులో చోటు చేసుకుంది. అంతకు ముందు బాలకృష్ణ (Balakrishna) తో కె.విశ్వనాథ్ తెరకెక్కించిన 'జననీ జన్మభూమి'లోనూ సీతారామశాస్త్రి రాసిన గీతాన్ని సందర్భానుసారంగా విశ్వనాథ్ ఉపయోగించు కున్నారు. 'స్వాతిముత్యం' కథ తరువాత విశ్వనాథ్ దర్శకత్వంలోనే అనిల్ కపూర్, విజయశాంతి జంటగా హిందీలో 'ఈశ్వర్' పేరుతో రూపొందింది. ఈ కథను కన్నడలో 'స్వాతి ముత్తు' పేరుతో సుదీప్ హీరోగా తెరకెక్కించారు. ఈ చిత్రాలు సైతం ఆదరణ పొందాయి. 'స్వాతిముత్యం'తో ఉత్తమ నటునిగా కమల్ హాసన్, ఉత్తమ దర్శకునిగా కె.విశ్వనాథ్ నంది అవార్డులు అందుకున్నారు. ఇక జాతీయ, రాష్ట్రస్థాయిలో 'స్వాతిముత్యం' ఉత్తమ చిత్రంగా నిలచింది.