మరపురాని పాటలతో 'నిరీక్షణ'
ABN , Publish Date - Mar 14 , 2026 | 09:26 AM
భాను చందర్, అర్చన జంటగా నటించిన 'నిరీక్షణ' చిత్రం విడుదలై 40 సంవత్సరాలైంది. ఇప్పటికీ ఈ సినిమా కోసం ఇళయరాజా స్వరపర్చిన పాటలు శ్రోతలను ఆకట్టుకుంటూనే ఉన్నాయి.
కొన్ని సినిమాలు బంపర్ హిట్స్ కాకపోయినా - మనసును హత్తుకొంటాయి. ఎన్నాళ్ళయినా మరపు రాకుండా చేస్తాయి. అలాంటి చిత్రాల్లో 40 ఏళ్ళ క్రితం వెలుగు చూసిన 'నిరీక్షణ' ఒకటి. అందులోని కథాంశం ఈ నాటికీ కొందరి మదిని తడుతూనే ఉంది.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బాలు మహేంద్ర (Balu Mahendra) దర్శకునిగానూ తనదైన బాణీ పలికించారు. ఆయన ఎంచుకొనే కథలు సున్నితంగా ఉంటాయి. అందులో వాస్తవికత కూడా తొంగిచూస్తూ ఉంటుంది. ఆ తరహా చిత్రమే 'నిరీక్షణ' (Nireekshana). ఈ చిత్రాన్ని లక్ష్మీ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై కె. లింగమూర్తి నిర్మించారు. భానుచందర్ (Bhanuchander), అర్చన (Archana) నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా (Ilayaraja) సంగీతం ప్రాణం పోసింది. ఆత్రేయ పాటలు, జంధ్యాల మాటలు కూడా సినిమాకు ఓ వన్నె తెచ్చాయి. 1986 మార్చి 14వ తేదీన విడుదలైన 'నిరీక్షణ' చిత్రం పలువురిని భలేగా ఆకట్టుకుంది.
'నిరీక్షణ' టైటిల్ ను బట్టే ఎవరికోసమో ఎవరో వేచి ఉన్నారని తెలుస్తుంది. ఇందులో మురళీకృష్ణ అనే ఫారెస్ట్ రేంజర్, తులసి అనే గిరిజన వనిత ప్రేమించుకుంటారు. పెళ్ళాడాలనే సమయానికి మురళీలాగే ఉన్న నేరస్థుని కారణంగా ఇతణ్ణి పోలీసులు అరెస్ట్ చేస్తారు. హీరో పోలీసుల నుండి తప్పించుకొనే క్రమంలో ఓ పోలీస్ చనిపోతాడు. దాంతో జైలు పాలయిన హీరోకోసం హీరోయిన్ నిరీక్షిస్తుంది. చివరకు హీరో జైలు నుండి విడుదలై వచ్చి ప్రియురాలిని కలుసుకోవడంతో సుఖాంతమవుతుంది. జైలులో ఖైదీల జీవనం ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. ఈ కథను బాలు మహేంద్ర తన కెమెరా పనితనంతో మరింత అందంగా తెరకెక్కించారు.
అంతకు ముందు లక్ష్మీ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై కృష్ణ హీరోగా 'వజ్రాయుధం', చిరంజీవితో 'కిరాతకుడు' చిత్రాలను నిర్మించారు లింగమూర్తి. 'నిరీక్షణ' లక్ష్మీ ఫిలిమ్స్ డివిజన్ లో మూడో సినిమా. ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, పి.యల్.నారాయణ, రాళ్ళపల్లి, అల్లు రామలింగయ్య, నర్రా వెంకటేశ్వరరావు తదితరులు నటించారు. ఈ సినిమాకు బాలు మహేంద్ర దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలనూ నిర్వహించారు. ఇందులో ఓ సీన్ లో భానుచందర్ నగ్నంగా కనిపించటం, హీరోయిన్ అర్చన జాకెట్ లేకుండా నటించటం వంటికి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచాయి. ఈ నాటికీ 'నిరీక్షణ'లోని పాటలను మననం చేసుకుంటూ ఆత్రేయ వాణిని, ఇళయరాజా బాణీలను కీర్తించేవారెందరో ఉన్నారు.