ప్రేమ్ ర‌క్షిత్ మాస్ట‌ర్‌కు అరుదైన గౌర‌వం.. మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ నుంచి ప్రశంసలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 09:31 AM

నాటు నాటు పాట‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌త్యేక గుర్తింపును ద‌క్కించుకున్నాడు టాలీవుడ్ నృత్య ద‌ర్శ‌కుడు ప్రేమ్ ర‌క్షిత్ మాస్టర్. ఆయ‌న‌కు తాజాగా మ‌రో అరుదైన గౌర‌వం ల‌భించింది.

vincent paterson

'ఆర్.ఆర్.ఆర్.' చిత్రంలోని నాటు నాటు పాట‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌త్యేక గుర్తింపును ద‌క్కించుకున్నాడు టాలీవుడ్ నృత్య ద‌ర్శ‌కుడు ప్రేమ్ ర‌క్షిత్ (Prem Rakshith) మాస్టర్. ఆయ‌న‌కు తాజాగా మ‌రో అరుదైన గౌర‌వం ల‌భించింది. పాప్ సంగీత ప్రపంచాన్ని శాసించిన మైఖేల్ జాక్స‌న్ (Michael Jackson) కు ఐకానిక్ డాన్స్ స్టెప్స్ రూపొందించిన ప్రముఖ కొరియోగ్రాఫర్‌ విన్సెంట్ ప్యాటర్సన్ (Vincent Paterson) ప్రేమ్ ర‌క్షిత్ ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రేమ్ రక్షిత్ మాస్టర్ తన ఇన్‌స్టాలో అభిమానుల‌తో పంచుకున్నారు.

ఈ వీడియోలో.. విన్సెంట్ ప్యాటర్సన్ 'హలో ప్రేమ్.. నేను విన్సెంట్ ప్యాటర్సన్. చాలా సంవత్సరాలు మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేశాను. మీ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. మీరు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సభ్యుడిగా ఉండటం ఆనందంగా ఉంది. ఇండియాలో కొత్త తరానికి చెందిన కొరియోగ్రాఫర్లు తమ కలలను నెరవేర్చుకుంటున్నారు. ఎప్పుడో ఒక రోజు మిమ్మల్ని కలవాలని ఉంది' అంటూ వీడియోలో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా.. విన్సెంట్ ప్యాటర్సన్ (Vincent Paterson)కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన కెరీర్‌లో మైఖేల్ జాక్సన్‌తో పాటు మ‌డోన్నా (Madonna) వంటి అంతర్జాతీయ స్టార్‌లతో పనిచేశారు. మ్యూజిక్ ఆల్బమ్స్, సినిమాలు, బ్రాడ్‌వే షోలు, భారీ స్టేజ్ కచేరీలు వంటి ఎన్నో ప్రాజెక్ట్‌లతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న‌కంటూ ప్ర‌త్యేక శైలిని క్రియేట్ చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా.. ప్రేమ్ రక్షిత్ స్పందించి చిన్నప్పటి నుంచి విన్సెంట్ ప్యాటర్సన్ స్మూత్ క్రిమిన‌ల్ (Smooth Criminal) పాటకు తాను పెద్ద అభిమానినని చెప్పారు. మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేసిన లెజెండ్ నుంచి తాను అభినందనలు అందుకోవడం గ‌ర్వంగా ఉంద‌ని చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే.. ప్ర‌భాస్ (Prabhas) ఛ‌త్ర‌ప‌తి (Chatrapathi) సినిమాతో కెరీర్ ప్రారంభించిన‌ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ బాహుబ‌లి ( Baahubali), బిల్లా (Billa), అప‌రిచితుడు (Aparichitudu), రంగ్ దే బ‌సంతి (Rang De Basanti), స‌ర్కార్ (Sarkar), భోళా శంక‌ర్ (Bhola Shankar) వంటి తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 200కు పైగా సినిమాల్లో డాన్స్ కంపోజ్ చేశారు. 'ఆర్.ఆర్.ఆర్.' సినిమాలోని నాటు నాటు (Naatu Naatu) పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఆయన పేరు ఇంకా మారు మ్రోగిపోయింది.

Updated Date - Mar 13 , 2026 | 12:39 PM