మొన్న ఎమ్జీఆర్, ఎన్టీఆర్... నేడు విజయ్‌!

ABN , Publish Date - May 04 , 2026 | 05:36 PM

తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు అనూహ్యంగా మారాయి... కింగ్ మేకర్ అవుతాడనుకున్న విజయ్ 'కింగ్' అయ్యే దిశగా సాగుతున్నారు... తమిళనాడు సీయమ్ గా విజయ్ అయ్యారనుకోండి - అతను 'మూడో హీరో'గా నిలిచేలా కనిపిస్తోంది...

MGR NTR Vijay

ఎన్నికల ఫలితాలకు ముందు సర్వేలన్నీ తమిళనాడులో అధికార పార్టీ డీ.యమ్.కే. మళ్ళీ పాలనాపగ్గాలు చేపడుతుందని చాటాయి... ఒకే ఒక్క 'యాక్సిస్ మై ఇండియా' సంస్థ మాత్రమే విజయ్ కి 98 నుండి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది... ఆ సంస్థ సర్వే నిజమవుతూ విజయ్ వంద సీట్లు గెలుచుకొనేలా కనిపిస్తోంది... అయితే పూర్తి మెజారిటీ 118 సీట్లు వస్తాయో రావో కానీ, ఇప్పటికైతే తమిళనాట అతిపెద్ద పార్టీగా నిలిచేది విజయ్ నెలకొల్పిన 'తమిళగ వెట్రి కళగం' అనే తెలుస్తోంది... దీంతో విజయ్ కు ఒకవేళ కొన్ని సీట్స్ తగ్గితే అటు పాలనా పగ్గాలు వదిలేస్తోన్న డీయమ్కే కానీ, ఇటు ఏఐడియమ్కే కానీ విజయ్ కి మద్దతు ఇవ్వవలసి ఉంటుంది... ఏది ఏమైనా తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేయబోతారన్నది ఖాయం... అప్పుడు మన దేశంలో ముఖ్యమంత్రి అయిన మూడవ స్టార్ హీరోగా విజయ్ చరిత్రలో నిలుస్తారు...


ఫస్ట్ హీరో... ఎమ్జీఆర్...

సినిమాలకు, పాలిటిక్స్ కు మధ్య బంధంతో సాగిన తొలి రాష్ట్రంగా తమిళనాడు నిలచింది... చిత్రసీమలో రచయితలుగా సాగిన అన్నాదొరై, కరుణానిధి ముందుగా ముఖ్యమంత్రులయ్యారు... వారి తరువాత 1977 ఎన్నికల్లో ఎమ్జీఆర్ 130 సీట్లలో గెలిచి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు... ప్రపంచంలో ఓ సినిమా నటుడు రాజ్యాధికారం చేపట్టింది ఎమ్జీఆర్ తోనే మొదలయిందని చెప్పవచ్చు... తరువాత 1980 తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో 162 సీట్లతో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఎమ్జీఆర్... 1984లో 195 సీట్లతో ఎమ్జీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు... ఇలా తమిళనాట మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన స్టార్ హీరో ఎమ్జీఆర్ అనే చెప్పాలి... ఇప్పుడు విజయ్ తమిళనాట సీయమ్ కాబోతున్న రెండో స్టార్ గా నిలవనున్నారు...


యన్టీఆర్ అరుదైన చరిత్ర...!

ఎమ్జీఆర్ తరువాత మనదేశంలో రాజకీయాల్లో ప్రవేశించి అధికారం చేపట్టిన స్టార్ హీరో యన్టీఆర్ అనే చెప్పాలి... ఎమ్జీఆర్ లాగా ముందు ఓ పార్టీలో ఉండి, తరువాత ఎమ్మెల్యే అయి, ఆ పై ఆ పార్టీ నుండి బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టి విజయం సాధించలేదు యన్టీఆర్... 1982 మార్చి 29న 'తెలుగుదేశం పార్టీ'ని నెలకొల్పి, తొమ్మిది నెలల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన ఘనత యన్టీఆర్ సొంతం... ఆ తరువాత ఎందరు స్టార్స్ పార్టీలు పెట్టినా యన్టీఆర్ లాగా ఘనవిజయం సాధించలేదు... 1983 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యన్టీఆర్ 201 సీట్లతో ఘనవిజయం సాధించారు... 1985లో మరోమారు ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ సాగాయి... అప్పుడు కూడా యన్టీఆర్ 200పైగా సీట్లతో విజయఢంకా మోగించారు... 1989లో ఓటమి పాలయినా, యన్టీఆర్ 1994లో 216 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్నారు... అలా యన్టీఆర్ గెలిచిన ప్రతీసారి రెండువందల పై చిలుకు స్థానాలతోనే అధికారం చిక్కించుకోవడం విశేషం... 1984 ఆగస్టు 16న యన్టీఆర్ ను బర్తరఫ్ చేశారు... కేవలం నెలరోజుల్లో ప్రజాపోరాటం చేసి మళ్ళీ సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు యన్టీఆర్... ఇలాంటి అరుదైన చరిత్రను ఏ రాజకీయనాయకుడు ఇప్పటి దాకా సాధించలేదు.. యన్టీఆర్ తరువాత దాదాపు 32 ఏళ్ళకు ఓ స్టార్ హీరో సీయమ్ అవ్వడం అన్నది విజయ్ విషయంలోనే జరుగనుంది...


ఇప్పుడూ అదే తీరు...

ఎమ్జీఆర్, యన్టీఆర్ ను కేంద్రప్రభుత్వాలు పలు ఇబ్బందుల పాలు చేశాయి... 1980లో ఎమ్జీఆర్ బర్తరఫ్ అయ్యారు... అయితే మళ్ళీ ఎన్నికల్లోనే ఆయన గెలిచారు... యన్టీఆర్ అలా కాదు తాను బర్తరఫ్ అయినా కేంద్రంపైనే పోరాటం చేసి కేవలం నెల రోజుల్లోనే తిరిగి పదవిని చేపట్టారు... ఇక రాజకీయాల్లో సొంత పార్టీ పెట్టి పోటీ చేస్తున్న సమయంలోనూ ఎమ్జీఆర్, యన్టీఆర్ సినిమాలకు పలు ఇబ్బందులు కలిగించారు... యన్టీఆర్ 'బొబ్బిలిపులి'ని రిలీజ్ కాకుండా చేయాలని కేంద్రం ప్రయత్నించింది... అభిమానుల పోరాటంతో 'బొబ్బిలిపులి' రిలీజై ఘనవిజయం సాధించింది... అయితే తన 'బ్రహ్మంగారి జీవితచరిత్ర' విషయంలోనూ యన్టీఆర్ సెన్సార్ తో పోరాడవలసివచ్చింది... అదే తీరున విజయ్ 'జననాయగన్' మూవీకి కూడా సెన్సార్ ఇబ్బందులు ఎదురయ్యాయి... ఇలా రాజకీయాల్లో అడుగుపెట్టిన స్టార్స్ గెలుపు దిశగా సాగే ఛాన్స్ ఉంటే వారికి అధికార పార్టీలు ఇక్కట్లు సృష్టించడం కొత్తేమీ కాదు... విజయ్ 'జననాయగన్' మూవీ రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో లీకైంది... విజయ్ సీయమ్ అయిన తరువాతైనా 'జననాయగన్' థియేటర్స్ లో సందడి చేస్తుందేమో చూద్దాం...

Updated Date - May 04 , 2026 | 05:37 PM