విడాకులు ఇప్పించండి.. ఫ్యామిలీ కోర్టుకు దళ‌ప‌తి విజ‌య్ భార్య‌

ABN , Publish Date - Feb 27 , 2026 | 06:21 PM

తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయన నుండి విడాకులు ఇప్పించమంటూ భార్య సంగీత కోర్టును ఆశ్రయించారు.

Hero Vijay - Sangeetha

మరికొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో స్టార్ హీరో విజయ్‌ (Vijay) చిక్కుల్లో పడ్డారు. ఈ యేడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్న ఆయన చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) సెన్సార్ సమస్యల కారణంగా ఇంతవరకూ విడుదలకు నోచుకోలేదు. ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడకముందే ఇప్పుడు విజయ్ వ్యక్తిగత జీవితంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఇరవై ఆరేళ్ళుగా విజయ్‌తో జీవితాన్ని కొనసాగిస్తున్న ఆయన భార్య సంగీత (Sangeetha) తన భర్త నుండి విడాకులు కోరుతూ చెంగల్పట్టు జిల్లా కోర్టును ఆశ్రయించింది.


కొన్ని రోజుల క్రితం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్‌, విజయ్ వ్యక్తిగత జీవితంపై కొన్ని విమర్శలు చేశారు. స్టార్ హీరోయిన్ త్రిష (Trisha)తో ఆయన సన్నిహితంగా మెలుగుతున్నాడని ఆరోపించాడు. దీనిపై త్రిష తీవ్రంగా స్పందించడంతో నాగేంద్రన్ వెంటనే క్షమాపణలు చెప్పి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అయితే అప్పట్లో కొందరు నిప్పులేనిదే పొగరాదంటూ కామెంట్స్ చేశారు. కానీ ఈ విషయం ఆ తర్వాత సద్దుమణిగింది. కానీ ఇంతలోనే సంగీత... విజయ్‌ నుండి విడాకులు కోరుతూ కోర్ట్ కెక్కడంతో ఈ విమర్శలకు మళ్ళీ జీవం పోసినట్టయ్యింది. 1999లో విజయ్ వివాహం సంగీతతో జరగ్గా వారికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు జాసన్ సంజయ్‌ ప్రస్తుతం సందీప్ కిషన్‌ హీరోగా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.


తమ వైవాహిక జీవితం సజావుగా సాగడం లేదని, వ్యక్తిగత కారణాలతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని విజయ్ భార్య సంగీత తన పిటీషన్‌లో పేర్కొంది. దీనిని స్వీకరించిన న్యాయస్థానం ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాల్సిందిగా విజయ్‌కు నోటీసులు పంపింది. ఏదేమైనా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఈ వ్యవహారం విజయ్‌కు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టేదేనని సినీ, రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Updated Date - Feb 27 , 2026 | 07:22 PM