Suresh Kumar: ముంబైలో కన్నుమూసిన తెలుగు నటుడు
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:10 PM
రంగస్థల, సినీ నటుడు సురేశ్ కుమార్ ముంబైలో గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఆయన సినిమాలు, నాటకాల్లో నటించారు. మూడు దశాబ్దాలకు పైగా బ్యాంకింగ్ రంగానికీ ఆయన విశేష సేవలు అందించారు.
కొత్త సంవత్సరంలో తొలి విషాదం చోటు చేసుకుంది. వివిధ భాషల్లో పలు చిత్రాలలో నటించిన సి. సురేశ్ కుమార్ గుండెపోటుతో ముంబైలో తుదిశ్వాస విడిచారు. యుక్త వయసు నుండి రంగస్థలంలో నటుడిగా తన సత్తా చాటిన సురేశ్ కుమార్ (Suresh Kumar) ఆ తర్వాత వెండితెరపై, బుల్లితెరపై పలు పాత్రలను పోషించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆయన ఎం.ఎన్.సి. బ్యాంక్స్ కు తన సేవలను అందించారు. వివిధ హోదాలలో వాటిలో పనిచేశారు. అలానే ముంబై, హైదరాబాద్ లోని థియేటర్ గ్రూప్స్ లో కీలకపాత్రను పోషించారు. అలానే తెలుగు, హిందీ, తమిళ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో పలు నాటకాలను ప్రదర్శించారు. ఎన్.ఎస్.డి. ఢిల్లీ, జమ్ము, బికనూర్ లలో జరిగిన నాటకోత్సవాల్లో పాల్గొన్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్ తో పాటు పలువురి చిత్రాలలో ఆయన నటించారు. తెలుగులోనూ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహానటి, గోల్గొండ హైస్కూల్' తదితర చిత్రాలలో యాక్ట్ చేశారు. 'ఎన్టీఆర్: కథానాయకుడు' చిత్రంలో సురేశ్ కుమార్ పి. వి.నరసింహారావు పాత్రను పోషించారు. ది హిందు దినపత్రిక 'ది మెట్రో ప్లస్' అనుబంధంలో సంగీతం, నాటక రంగానికి సంబంధించిన వార్తలను సురేశ్ కుమార్ ప్రీలానర్స్ గా రిపోర్టింగ్ చేశారు.
ఆ అనుబంధం మరువలేను: జయశ్రీ రాచకొండ
సీనియర్ నటుడు సురేశ్ కుమార్ ముంబైలో కన్నుమూసిన విషయం తెలిసి నటి జయశ్రీ రాచకొండ ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు ఏడున్నర సంవత్సరాల క్రితం ఆయనతో కలిసి తొలిసారి 'ఎక్స్ టెండెడ్ వారెంటీ' షార్ట్ ఫిల్మ్ లో నటించిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.

ఆమె మాట్లాడుతూ, 'ఎక్స్ టెండెడ్ వారంటీ' షార్ట్ ఫిల్మ్ లో సురేశ్ కుమార్ గారి భార్యగా నేను నటించాను. దర్శకుడు గౌతమ్ ఈ పాత్రకు నన్ను ఎంపిక చేసిన తర్వాత నేను దానికి న్యాయం చేయగలనో లేదో అనే సందేహం కలుగుతుండేది. సురేశ్ కుమార్ గారి ఇంటిలోనే మా యాక్టింగ్ వర్క్ షాప్ జరిగింది. ఆ సమయంలో ఆయన ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. నన్ను ఎంతో ప్రోత్సహించి, ధైర్యంగా నటించేలా చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్ కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు లభించాయి. అలా మొదలైన మా పరిచయంతో మేమంతా ఒకే కుటుంబ సభ్యులుగా మారిపోయాం. ఆ తర్వాత ఆయనతో కలిసి పలు కమర్షియల్స్ లోనూ, వెబ్ సీరిస్ లోనూ నటించాను. తోటి నటీనటులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అంత మంచి మనసున్న వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు. ఆయన భార్య సంగీత, ఇద్దరబ్బాయిలకు కూడా సినిమా, నాటక రంగాలతో అనుబంధం ఉంది. గత కొంతకాలంగా వారు ముంబైలో పిల్లలతోనే ఉంటున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ కు బయలు దేరే ముందు హఠాత్తుగా గుండెపోటు రావడంతో సురేశ్ కుమార్ కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు' అని అన్నారు. సురేశ్ కుమార్ ఫ్యామిలీ మెంబర్స్ కు జయశ్రీ రాచకొండ ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.