మీర్జాపురం రాణి - కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి: వెంకయ్య నాయుడు
ABN , Publish Date - Apr 15 , 2026 | 10:40 AM
సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రాసిన 'మీర్జాపురం రాణి - కృష్ణవేణి' పుస్తకాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె జీవితం ఈ తరానికి స్ఫూర్తి అని తెలిపారు.
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరం వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మీర్జాపురంరాణి -కృష్ణవేణి పుస్తకాన్ని రచయిత భగీరథ, నిర్మాత ఎన్. ఆర్. అనురాధాదేవి... వెంకయ్య నాయుడు గారికి బహుకరించారు .
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, 'తెలుగు సినిమా ప్రారంభ రోజుల్లో బాలనటిగా ప్రవేశించి, కథానాయికగా ఎదిగిన కృష్ణవేణమ్మ గారు మీర్జాపురం రాజా వారిని వివాహం చేసుకోవడంతో ఆమె జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింద'ని చెప్పారు. 'కృష్ణవేణమ్మ గారు కేవలం నటి, గాయని మాత్రమే కాదు, అభిరుచి కలిగిన నిర్మాత. ఆమె ఎన్నో సందేశాత్మక సినిమాలను రూపొందించారు.
ముఖ్యంగా ఎన్. టి. రామారావు గారిని 'మనదేశం 'సినిమాతో పరిచయం చేశారు . అందుకే ఆమె అంటే నాకు గౌరవం' అని వెంకయ్య నాయుడు చెప్పారు. అక్కినేని నాగేశ్వర రావు, అంజలీదేవి, ఎస్. వి. రంగారావు, రేలంగి వెంకట్రామయ్య, సిహెచ్. నారాయణ రావు, ఘంటసాల, రమేష్ నాయుడు, త్రిపురనేని గోపీచంద్, తాపీ ధర్మారావు, చిత్రపు నారాయణ మూర్తి లాంటి వారికి చేయూత నిచ్చిన కృష్ణవేణమ్మ చిరస్మరణీయురాలని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో 2025 డిసెంబర్14న 'మనదేశం' సినిమా వజ్రోత్సవ వేడుకలు, 'తారకరామం' పుస్తకావిష్కరణ సభలో, తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలసి కృష్ణవేణమ్మను సత్కరించామని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. మీర్జాపురంరాణి -కృష్ణవేణి పుస్తకాన్ని రచించిన సీనియర్ జర్నలిస్ట్ భగీరథను, నిర్మాత ఎన్. ఆర్. అనురాధాదేవిని వెంకయ్య నాయుడు అభినందించారు.