పాన్ ఇండియా మూవీగా.. 'వనజీవి రామయ్య'

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:03 PM

వనజీవి రామయ్య 90వ జయంతి సందర్భంగా 'వనజీవి రామయ్య' లఘుచిత్రాన్ని పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా నిర్మించనున్నట్లు నిర్మాత నరేష్ ప్రజాపతి ప్రకటించారు.

vanajeevi ramaiah

పర్యావరణ ఉద్యమానికి జీవితాన్నే అంకితం చేసిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య (వనజీవి రామయ్య) సేవలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో రూపొందిన 'వనజీవి రామయ్య' లఘుచిత్రాన్ని త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో పూర్తి నిడివి ఫీచర్ ఫిల్మ్‌గా నిర్మించనున్నట్లు నిర్మాత నిడిగొండ నరేష్ ప్రజాపతి ప్రకటించారు. వనజీవి రామయ్య 90వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వనజీవి హరిత అవార్డుల కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేస్తున్న పలువురు సేవాభావం కలిగిన వ్యక్తులను హరిత అవార్డులతో సత్కరించారు. అలాగే తెలంగాణలోని పల్లె ప్రకృతి వనాలకు వనజీవి రామయ్య పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వాస్విక్ గ్రూప్ చైర్మన్ నిడిగొండ నరేష్ ప్రజాపతి, వాస్విక్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి, దర్శకుడు వేముగంటి, పర్యావరణ కార్యకర్త మొక్కల వెంకటయ్యతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మొక్కల ద్వారా ప్రకృతి సంరక్షణకు కృషి చేస్తున్న వారికి ప్రత్యేకంగా సన్మానాలు నిర్వహించారు.

వనజీవి రామయ్య జీవితం ఆధారంగా రూపొందిన ఈ లఘుచిత్రం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేసే గద్దర్ అవార్డ్స్‌లో ఉత్తమ లఘుచిత్రాల విభాగానికి ఎంపిక కావడం విశేషం. ఇందులో బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించగా, నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వం వహించారు. కథను డా. కళా రంగా అందించగా, సంగీతాన్ని బల్లేపల్లి మోహన్ సమకూర్చారు. చిత్రాన్ని నిడిగొండ నరేష్ ప్రజాపతి నిర్మించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత నరేష్ ప్రజాపతి మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సమస్యలను దశాబ్దాల క్రితమే గుర్తించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు వనజీవి రామయ్య అని కొనియాడారు. ఆయన ఆశయాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

దర్శకుడు వేముగంటి మాట్లాడుతూ, ప్రకృతి కోసం ఏడు దశాబ్దాల పాటు నిరంతరం కృషి చేసిన వనజీవి రామయ్య జీవితం నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఆయన సందేశాన్ని మరింత మందికి చేరవేసే ప్రయత్నమే ఈ చిత్రమని తెలిపారు.హీరోయిన్ నాగరాణి మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రంలో నటించడం తనకు గర్వకారణమని అన్నారు. సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ మాట్లాడుతూ, ప్రకృతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడి కథకు సంగీతం అందించడం తన కెరీర్‌లో ప్రత్యేకమైన అనుభవమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, పర్యావరణ కార్యకర్తలు, సాహిత్యవేత్తలు, సామాజిక సేవకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వనజీవి రామయ్య సేవలను స్మరించుకున్నారు.

Updated Date - Jul 02 , 2026 | 04:01 PM