Monalisa: కుంభమేళా మోనాలిసా.. కేసులో ట్విస్టు! ఆమె మేజర్.. భర్తకు ట్రాన్సిట్ బెయిల్
ABN , Publish Date - Jun 04 , 2026 | 06:33 AM
కుంభమేళా మోనాలిసాగా పేరు గాంచిన యువతి ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఆమెను మేజర్‌గానే భావించవచ్చని కేరళ హైకోర్టు అభిప్రాయ పడింది.
కుంభమేళా మోనాలిసా (Monalisa) గా పేరు గాంచిన యువతి ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఆమెను మేజర్‌గానే భావించవచ్చని కేరళ హైకోర్టు (High Court of Kerala) అభిప్రాయ పడింది. ఆమె భర్త మహమ్మద్ ఫర్మాన్ (Farman Khan) కు బుధవారం నెల రోజుల ట్రాన్సిట్ బెయిల్‌ను మంజూరు చేసింది. బర్త్ సర్టిఫికెట్, ఓటరు కార్డు, బ్యాంకు పాస్బుక్‌ల ద్వారా.. యువతి పుట్టినతేదీ 2008 జనవరి1 అని తెలుస్తోందని, తద్వారా ఆమెను మేజర్ గానే భావించవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా, కేరళకు చెందిన ఫర్మాన్ ఈ ఏడాది ప్రారంభంలో కేరళలో వివాహం చేసుకున్నారు. అయితే, మోనాలిసా మైనర్ అని, ఆమెను అపహరించుకు వెళ్లాడంటూ ఫర్మాన్ మీద ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై మధ్యప్రదేశ్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని ఫర్మాన్, ఆయన భార్య కేరళ హైకోర్టులో సంయుక్తంగా పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ పోలీసుల తరపున భారత అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్ ఐ) ఎస్ వీ రాజు వాదనలు వినిపిస్తూ యువతి మైనర్ అని, కోర్టుకు ఆమె సమర్పించిన జనన ధ్రువీకరణ పత్రం ఫోర్జరీదన్నారు.
హిందూ ఇస్లాం మతాలకు చెందిన వారిద్దరి పెళ్లి కేరళలో ఒక ఆలయంలో జరిగింది. కాబట్టి, వివాహం చెల్లదని, దానిని స్థానిక రిజిస్ట్రార్ నమోదు. చేసి వివాహ సర్టిఫికేట్ జారీ చేయటం కూడా చెల్లదన్నారు. పర్మాన్‌కు బెయిల్ ఇవ్వటానికి వీల్లేదన్నారు. అయితే.. ఏఎస్ జీఐ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఆరోపణలపై దర్యాప్తు జరగాల్సి ఉందన్నారు.
ఫర్మాన్ విజ్ఞప్తిని ఆమోదిస్తూ.. జూన్ 3వ తేదీ నుంచి నెల రోజుల పాటు ట్రాన్సిట్ బెయిల్‌ను మంజూరు చేస్తున్నామని, ఆ లోపు మధ్యప్రదేశ్ కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చన్నారు. ఈ నెల రోజుల్లో అతడిని అరెస్టు చేయటానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. వాదనల సందర్భంగా ఫర్మాన్, ఆయన భార్యను ఉద్దేశించి మీరు అదృష్టవంతులు.. కేరళలో ఉన్నారు' అని న్యాయమూర్తి వ్యాఖ్యానించగా. దానికి వారు బదులిస్తూ.. దానివల్లే తాము ఇంకా జీవించి ఉన్నామని చెప్పటం విశేషం.