Trivikram: అదరహో అనిపించేలా సౌజన్య శ్రీనివాస్ నృత్యం
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:41 AM
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య శ్రీనివాస్ మంచి నృత్య కళాకారిణి. ఇటు నిర్మాతగా, నృత్యకళాకారిణిగా ఆమె తన ప్రతిభను చాటుకుంటున్నారు.
మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) భార్య సాయి సౌజన్య (Sai Soujanya) చక్కని నృత్యకారిణి. ఇప్పటికే పలు నృత్యరూపకాలను ప్రదర్శించి చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు పలువురికి నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. తాజాగా 'మదాలస - స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్' ఆధ్వర్యంలో జరిగిన 'భావ రస నాట్యోత్సవం సీజన్ 1'లో ఆమె పాల్గొన్నారు. జనవరి 4వ తేదీ హైదరాబాద్ లోని ఫీనిక్స్ అరేనాలో కన్నుల పండువగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రఖ్యాత కళాకారులు శాస్త్రీయ నృత్య రూపాలైన భరతనాట్యం, మోహినియాట్టం ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో కేరళకు చెందిన విద్వాన్ మంజు వి. నాయర్ భరతనాట్యం ప్రదర్శన చేయగా, బెంగళూరుకు చెందిన విద్వాన్ స్వప్న రాజేంద్రకుమార్ మోహినియాట్టం ప్రదర్శన చేశారు. ఇక హైదరాబాద్ కు చెందిన విద్వాన్ సౌజన్య శ్రీనివాస్ భరతనాట్య ప్రదర్శన చేశారు. ఈ ముగ్గురు ప్రఖ్యాత కళాకారులు తమ అసాధారణ నృత్య ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
ఫీనిక్స్ గ్రూప్ కి చెందిన ఎమెరిటస్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఊతుకాడు వెంకట సుబ్బయ్యర్ ఘంభీరనట్టై రాగంలో స్వరపరిచిన 'శ్రీ విఘ్నరాజం భజే' అనే గణేశ కృతితో సౌజన్య శ్రీనివాస్ నృత్య ప్రదర్శనను గొప్పగా ఆరంభించారు.

అనంతరం ఒక్కొక్కరిగా వేదికపై నర్తించి ఆ నటరాజే మురిసిపోయేలా చేశారు. త్రిశూర్ మోహన్ కుమార్ సరమతి రాగంలో స్వరపరిచిన మోహినీయాట్టం వర్ణం శ్రీమతి స్వర్ణ రాజేంద్ర చే ప్రదర్శితమైంది. రాగమాలిక రాగంలో ఆదిశంకరాచార్య స్వరపరిచిన అర్ధనారీశ్వర స్తోత్రంకు సౌజన్య శ్రీనివాస్ భరతనాట్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. రాగమాలిక రాగంలో శివప్రసాద పంచకంకు శ్రీమతి మంజు నాయర్ భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు.
సింహేంద్ర మధ్యమం రాగంలో స్వరపరిచిన అష్టపదికి శ్రీమతి మంజు నాయర్ భరతనాట్య ప్రదర్శన ఇవ్వగా, శ్రీరాగంలో స్వరపరిచిన త్యాగరాజ కృతి 'ఎందరో మహానుభావుల'కు సౌజన్య శ్రీనివాస్ నాట్యం చేశారు. శుద్ధసారంగ రాగంలో స్వరపరిచిన ఆంజనేయ కీర్తనకు శ్రీమతి మంజు నాయర్, భూపాల రాగంలో మోహినియాట్టం తిల్లానాకు శ్రీమతి స్వప్న రాజేంద్ర అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సౌజన్య శ్రీనివాస్ తండ్రి, 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి సోదరుడు శ్రీరామశాస్త్రి కూడా పాల్గొన్నారు.

విశేషం ఏమంటే... త్రివిక్రమ్ భార్య సౌజన్య శ్రీనివాస్ సొంత బ్యానర్ ఫార్యూన్ ఫోర్ సినిమాస్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి సినిమాలూ నిర్మిస్తున్నారు. ఇటు నిర్మాతగా, అటు నృత్యకారిణిగా ఆమె తన ప్రతిభను చాటుకుంటున్నారు.