బీజేపీ నేతకు.. త్రిష ఘాటైన జవాబు

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:13 PM

తమిళనాడు బీజేపీ నేత నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై త్రిష స్పందించారు. ఆమె తరఫున లాయర్ నిత్యేష్‌ నటరాజ్.. నాగేంద్రన్ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Actress Trisha

తమిళనాట రాజకీయాలు, సినిమా వేర్వేరు కాదు. చాలామంది సినీ ప్రముఖులు రాజకీయ పార్టీలు పెట్టారు. కొందరు రాజకీయ నాయకులు నటన మీద ఆసక్తితో ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. అయితే స్టార్ హీరో విజయ్ (Vijay) 'తమిళగ వెట్రి కళగం' పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు త్రిషతో ఉన్న అనుబంధాన్ని కొందరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, పార్టీ శాసనసభాపక్ష నేత నయినార్ నాగేంద్రన్... విజయ్ - త్రిష (Trisha) అనుబంధం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ పార్టీకి మద్దతు పలుకుతున్న ఇతర పార్టీల నేతలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. నటీనటుల వ్యక్తిగత విషయాల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని వారంతా ఖండించారు.


తాజాగా త్రిష తరఫున లాయర్ నిత్యేష్‌ నటరాజ్ సైతం స్పందించారు. తన క్లయింట్ త్రిషా కృష్ణన్ సూచన మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 'రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి అసంబద్ధమైన, అనుచితమైన వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్ ఎప్పుడూ ఊహించలేదు. నా క్లయింట్‌కు ఎటువంటి రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో చేరే ఉద్దేశం ఆమెకు లేదు. గతంలోనూ ఆమె ఈ విషయం స్పష్టంగా తెలియచేశారు. రాజకీయ అంశాల విషయంలో ఆమె ఎప్పుడూ తటస్థ వైఖరినే అనుసరిస్తోంది. ఓ నటిగా తనను గుర్తించాలన్నదే నా క్లయింట్ అభిలాష. రాజకీయ వ్యవహారాలను ఆమెకు ముడిపెట్టడం సరైనది కాదు. ముఖ్యంగా, వ్యక్తిగత జీవితాన్ని ప్రజా వేదికల్లో చర్చకు దారి తీసే అంశంగా మార్చకూడదు. ప్రజా జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బాధ్యతతో, సమతుల్యంగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా క్లయింట్‌కు సంబంధం లేని విషయాల్లో ఆమె పేరును అనవసరంగా ప్రస్తావించవద్దని మనవి చేస్తున్నాం' అని అందులో పేర్కొన్నారు.

ఈ ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్.. త్రిషకు క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు.

WhatsApp Image 2026-02-16 at 1.13.05 PM.jpeg

Updated Date - Feb 16 , 2026 | 05:17 PM