Mana Shankara Vara Prasad Garu: మన శంకరవరప్రసాద్ బాటలో.. ఆ రెండు చిత్రాలు! రివ్యూలపై కోర్టుకు
ABN , Publish Date - Jan 11 , 2026 | 07:17 PM
చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘మన శంకరవరప్రసాద్’ చిత్రానికి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
మెగాసార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘మన శంకరవరప్రసాద్’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రానికి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో రివ్యూ, రేటింగ్స్‌లపై నిషేధం విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా చాలా మంది బుక్ మై షోలో టికెట్‌లు బుక్ చేసుకున్న తర్వాత సినిమాపై రివ్యూలు, రేటింగ్స్ ఇస్తుంటారు.
అయితే ఇటీవల కాలంలో కొంత మంది ఈ పద్ధతిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కావాలనే కొన్ని సినిమాలకు వ్యతిరేకంగా రేటింగ్స్ ఇస్తున్నారు. ఈ విషయంపై కొంత కాలంగా నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్నడ సినిమాలకు సంబంధించి బెంగళూరు హైకోర్టు రివ్యూలు, రేటింగ్‌లను అనుమతించవద్దంటూ బుక్ మై షోను ఆదేశించింది.

ఇదే క్రమంలో ‘మన శంకరవరప్రసాద్’ చిత్రానికి సంబంధించిన రివ్యూలను, రేటింగ్‌లను అనుమతించవద్దంటూ ఢిల్లీ హైకోర్టు బుక్ మై షోను ఆదేశించింది. దీంతో రివ్యూస్ గానీ, రేటింగ్స్ గానీ ఇచ్చే వీలులేకుండా బుక్ మై షో ఆప్షన్‌ను డిజేబుల్ చేసింది.
కాగా, సంక్రాంతికి విడుదల కాబోతున్న మరో రెండు సినిమాలకూ ఇదే తరహా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సదరు నిర్మాతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ది రాజా సాబ్’ విడుదల తర్వాత వచ్చిన ఫలితాలతో నిర్మాతలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

కాగా.. సినిమా నిర్మాణం వెనుక పనిచేసే వేలమంది శ్రమను, కోట్ల రూపాయల పెట్టుబడిని కాపాడాలనే సంకల్పంతో బ్లాక్‌బిగ్, ఐప్లెక్స్ సంస్థలు భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ సంస్థలన్నీ ఏకమవగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మార్పుకు పూర్తి మద్దతు ప్రకటించాయి.
రేట్ల పెంపుపై హౌస్‌మోషన్ తిరస్కరణ
‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ప్రభుత్వం తాజాగా జారీచేసిన మెమోను సవాల్ చేస్తూ దాచేపల్లి చంద్రబాబు అనే న్యాయవాది హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్‌గోపాల్ తెలిపారు. ఇది అత్యవసర విషయం లేదా తిరిగి పునరుద్ధరించలేని విధంగా జరిగే నష్టానికి సంబంధించిన అంశం కానందున హౌస్‌మోషన్‌ను హైకోర్టు తిరస్కరించిందని.. సంక్రాంతి సెలవుల అనంతరం పిటిషన్ వేసుకోవచ్చని హైకోర్టు సూచించినట్లు తెలిపారు.
అయితే ‘రాజాసాబ్’ టికెట్ రేట్ల పెంపు మెమోను సస్పెండ్ చేస్తూ శుక్రవారం హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఆదేశాలు జారీచేసిందని.. భవిష్యత్తులో ఇలాంటి మెమోలు ఇవ్వరాదని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ చాలా తెలివిగా హైకోర్టుకు సెలవులు ఉన్నప్పుడు మెమో జారీచేశారని ఆరోపించారు. ముందురోజు తేదీతో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇలా అక్రమంగా మెమోలు జారీచేయడం కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని ఆరోపించారు. కోర్టుకు సెలవులు ఉన్నప్పుడు, వారాంతాల్లో మెమోలు ఇస్తున్న హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవర్తనను హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.