డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల కట్టడికి అదే మార్గం!

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:05 PM

తెలుగు నిర్మాతలు గత కొంతకాలంగా డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్ దోపిడీపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి ఛార్జీలు తలకు మించిన భారంగా ఉన్నాయని వారు వాపోతున్నారు.

ప్రస్తుతం నిర్మాతలను బాగా కలచి వేస్తున్న అంశం డిజిటల్ సర్వీస్‌ ప్రొవైడర్ల (డి.ఎస్.పి.) ఛార్జీలు. కొన్నేళ్ళుగా డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడ్‌ సంస్థలు కొంతమంది గుప్పెట్లోనే ఉన్నాయని, వారు నిర్మాతలను దారుణంగా దోచుకుంటున్నారని ఓ వాదన ఉంది. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌, నిర్మాతల మండలి ఎన్నికలు ఎప్పుడు జరిగినా... డీఎస్పీ ఛార్జీలను తగ్గించడానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇస్తుంటారు. కానీ దాన్ని మాత్రం నిలబెట్టుకోలేక పోతున్నారు. సినిమా థియేటర్ అద్దెలతో ఓ పక్క సతమతమౌతున్న చిన్న నిర్మాతలకు డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్ ఛార్జీస్‌ పెనుభారంగా మారింది. ఈ ధరలను అదుపు చేయాలంటూ గతంలో కొందరు చిన్న నిర్మాతలు రిలే నిరాహారదీక్షలు సైతం చేశారు. కానీ వారి మొర ఆలకించిన నాధుడు లేకపోయాడు.


అయితే ఇప్పుడు వారి ముందుకు ఓ పరిష్కార మార్గంగా కేరళ నిర్మాతల మండలి నిలిచి ఉంది. అక్కడి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ నేరుగా ఎగ్జిబిటర్లకు డిజిటల్‌ కంటెంట్‌ అందించే వ్యవస్థను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఉన్న సర్వీస్‌ ప్రొవైడర్లు 'వర్చువల్‌ ప్రింట్‌ ఫీ' పేరుతోనూ, ఇతర సాంకేతిక కారణాలు చెప్పి తమను నిలువునా దోచుకుంటు న్నాయని నిర్మాతలు వాపోతున్నారు. అయితే ఈ ధరలతో పోల్చితే కేరళ అసోసియేషన్‌ పంపిణీ చేస్తున్న రేట్లు చాలా తక్కువ అని దీనిని ఇక్కడ కూడా అమలు చేస్తే 70 నుండి 80 శాతం ఖర్చులు తగ్గుతాయని కొందరు నిర్మాతలు చెబుతున్నారు. అయితే కేరళలో మాదిరిగానే ఇక్కడ కూడా అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు, సింగిల్‌ థియేటర్లు తప్పనిసరిగా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌ అందించే కంటెంట్‌నే తీసుకోవాలని వారు కోరుతున్నారు. అలానే ఎగ్జిబిటర్స్ నిర్మాతల మండలి అందించే కంటెంట్‌ను నిరాకరించడం కానీ, వివాదాలు సృష్టించడం గానీ చేయకపోతే తప్పని సరిగా ఈ విధానం నిర్మాతలకు ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. తెలుగు సినిమా రంగం మనుగడ సాగించాలంటే డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడర్ల గుత్తాధిపత్యం పోవాలని, అందుకోసం కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ సైతం తెలుగు నిర్మాతలతో చేతులు కలపడానికి సిద్థం ఉన్నారని మరికొందరు నిర్మాతలు తెలిపారు. మరి నిర్మాతల మండలి ఆధ్వర్యంలో డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ సేవలనే మాటను ఎంతమంది బలపరుస్తారో చూడాలి.

Updated Date - Apr 16 , 2026 | 04:05 PM