నిర్మాతల మండలికి ఫిల్మ్ ఛాంబర్ లేఖ!
ABN , Publish Date - Feb 11 , 2026 | 05:36 PM
సినిమా నిర్మాతలు, పంపిణీ దారుల మధ్య లిఖిత పూర్వక ఒప్పందం లేకపోతే, వారి వివాదాలను తాము పరిష్కరించమని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తేల్చి చెప్పింది.
తెలుగు సినిమా నిర్మాతలకు, పంపిణీదారులకు మధ్య వివాదాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber) కు విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయి. దాంతో ఛాంబర్ పెద్దలు తలలు పట్టుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. పైగా వీరిద్దరి మధ్య జరిగిన ఒప్పందాలు రాతపూర్వకంగా లేకపోవడంతో వాటిని పరిష్కరించడం కూడా వీలుకాని పరిస్థితి ఏర్పడింది. దాంతో తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను ఛాంబర్ సెక్రటరీ కె. అశోక్ కుమార్ (K Ashok Kumar) మీడియాకు తెలియచేశారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతలకు సంబంధించి తమకు వస్తున్న ఫిర్యాదులపై దృష్టి పెట్టింది. ఈ విషయంలో తమకు ఎదురవుతున్న సమస్యను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముందుకు తీసుకెళ్ళింది. ఇందులో భాగంగా ఇకపై సంబంధిత పక్షాల మధ్య లిఖితపూర్వక ఒప్పందం లేని లావాదేవీలకు సంబంధించిన ఏ ఫిర్యాదు లేదా వివాదాన్నీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్వీకరించదని తెలిపింది. అంతేకాకుండా, సభ్యులు ఫిర్యాదులు సమర్పించాలనుకుంటే, అమలైన ఒప్పందం ప్రతితో పాటు 15 రోజులలోపు సమర్పించాలని తేల్చింది. ఎవరైనా సరైన పత్రాలు లేకుండా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే దానికి ఛాంబర్ బాధ్యత వహించదని, స్వంత బాధ్యతతోనే అలాంటి ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని జనవరి 29న జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి తీసుకున్నామని అశోక్ కుమార్ తెలిపారు. ఛాంబర్ తీసుకున్ని ఈ నిర్ణయాన్ని నిర్మాతల మండలి సభ్యులకు తెలియ చేయవలసిందిగా ఆయన ఆ లేఖలో కోరారు.