సీబీఎఫ్‌సీ వైఖరిపై దర్శకుల అసహనం
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:41 AM
సీబీఎఫ్‌సీపై తెలుగు దర్శకులు గుర్రుగా ఉన్నారు. సెన్సార్ నియమాల కారణంగా దర్శకులు పడుతున్న ఇబ్బందులపై దర్శకుల సంఘం ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది.
గత కొంత కాలంగా సీబీఎఫ్‌సీ (CBFC) అధికారులు తీసుకునే నిర్ణయాలు దర్శక నిర్మాతలకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నది ఫిల్మ్ నగర్ (Film Nagar)లో బాగా వినిపిస్తున్న మాట. సినిమాల టైటిల్స్ కు చివరి నిమిషంలో అభ్యంతరం వ్యక్తంతో కొత్త టైటిల్ తో ప్రమోషన్ చేసుకోలేక చాలామంది దర్శకనిర్మాతలు ఈ మధ్య కాలంలో ఇబ్బంది పడ్డారు. గడిచిన ఆరేడు నెలల్లో దాదాపు ఏడెనిమిది చిత్రాల పేర్లకు సీబీఎఫ్‌సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలానే కొంతమంది నిర్మాతలు తీసిన చిత్రాలను బోల్డ్ కంటెంట్ కారణంగానో, డ్రగ్స్ వాడకాన్ని గ్లోరిఫై చేసి చూపించినందునో ఎక్కువ కట్స్ చెప్పింది. దాంతో సదరు దర్శకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. సినిమా టైటిల్ మార్చనందుకు తన చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారని 'కపుల్ ఫ్రెండ్లీ' నిర్మాత మూవీ ప్రమోషన్స్ లో వాపోయారు.
గతంలో అవార్డ్ విన్నింగ్ మూవీస్ తీసిన ఓ సీనియర్ దర్శకుడు స్వీయ దర్శకత్వంలో తను నిర్మించిన ఓ సినిమాకు సెన్సార్ వారు 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారట. తను తీసిన ఏ సినిమా కూడా గతంలో ఇలా 'ఎ' సర్టిఫికెట్ పొందలేదని, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాలను, డ్రగ్ కల్చర్ ను తాను తెర మీద చూపిస్తే 'ఎ' సర్టిఫికెట్ ఎలా ఇస్తారని సీబీఎఫ్‌సీ అధికారులతో వాదనకు దిగాడట. పర్యవసానంగా ఆ సినిమా శాటిలైట్ స్ట్రీమింగ్ కోసం 'యు/ఎ' సర్టిఫికెట్ కోసం అప్లయ్ చేస్తే... సదరు అధికారులు రిజెక్ట్ చేసినట్టు సమాచారం. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే జరిగాయి.
సెన్సార్ విధి విధానాలు తెలియక కొందరు, తెలిసినా క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో మరికొందరు దర్శకులు తమకు తోచిన విధంగా సినిమాలు తీస్తున్నారు. తీరా సెన్సార్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు 'సమాజంలో జరుగుతున్నదే తాము తెర మీద చూపిస్తున్నామ'ని వాదిస్తున్నారు. ఇది ఒక కోణం అయితే... ఈ మధ్య కాలంలో ప్రతి తెలుగు సినిమా ఇతర భాషల్లోకి అనువాదం అవుతోంది. దాంతో ఉత్తరాది వారి మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో అనే అనుమానంతో చాలా సినిమాలను సీబీఎఫ్‌సీ అధికారులు నిశితంగా గమనించి, వాటికి ఎక్కువ కట్స్ చెప్పడం, లేదంటే 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా సినిమాల పేర్లను మార్చమని సీబీఎఫ్‌సీ అధికారులు ఒత్తిడి చేయడాన్ని దర్శక నిర్మాతలు సహించలేకపోతున్నారు.
సీబీఎఫ్‌సీ ఛైర్మన్‌గా శశిశేఖర్ వెంపటి (Sashi Sekhar Vempati) పదవీ బాధత్యలు స్వీకరించిన తర్వాత తెలుగు నిర్మాతలతో ఆయన ఇష్టాగోష్ఠిని ఏర్పాటు చేశారు. సెన్సార్ నియమ నిబంధనలను పాటించాల్సిందిగా వారిని కోరారు. నిర్మాతల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలానే తాజాగా సెన్సార్ బోర్డ్ ప్యానల్ ను ప్రక్షాళన చేశారు. పది మంది సభ్యుల స్థానంలో 18 మందితో కొత్త ప్యానల్ ను నియమించారు. అయితే... సెన్సార్ అధికారులకు తెలుగు దర్శకులకు మధ్య గడిచిన కొంతకాలంగా ఊహించని అగాధం ఏర్పడిందని తెలుస్తోంది. నిర్మాతలతో సమావేశం ఏర్పాటు చేసినట్టుగానే శశి శేఖర్ వెంపటి... దర్శకులతోనూ ఓ సమావేశం ఏర్పాటు చేసి ఉంటే బాగుందన్నది చాలామంది దర్శకుల అభిప్రాయం. కానీ అలాంటి ప్రయత్నం ఏదీ సీబీఎఫ్‌సీ నుంచి జరిగినట్టు లేదు. దాంతో అక్టోబర్ 1వ తేదీన తెలుగు దర్శకుల సంఘం 'సెన్సార్ షిప్ - తెలుగు సినిమాపై దాని ప్రభావం' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మధ్య కాలంలో సెన్సార్ విధానాల కారణంగా ఇబ్బందుల పడ్డ దర్శకులంతా ఆ సమావేశంలో తమ మనోభావాలను వ్యక్తం చేసే ఆస్కారం ఉంది. అలానే సెన్సార్ నియమ నిబంధనలను సరళీకృతం చేయాల్సిన అంశం గురించి కూడా వారు తమ అభిప్రాయాలను తెలియచేయబోతున్నారట.
ఇటీవల కాలంలో చాలామంది దర్శకులు సెన్సార్ విధానం కారణంగా ఇబ్బందులు పడ్డారని, వారి వాయిస్ ను సమిష్టిగా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలనే ఉద్దేశ్యంతోనే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య (V.N. Aditya) చెప్పారు. ఈ మొత్తం కార్యక్రమ సారాంశాన్ని సీబీఎఫ్‌సీ ఛైర్మన్ శశి శేఖర్ వెంపటి దృష్టికి తీసుకెళతామని, తెలుగు వ్యక్తి కాబట్టి తమ సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నామని వి.ఎన్. ఆదిత్య అన్నారు. మరి సెన్సార్ అధికారులు - తెలుగు దర్శకుల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ కు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి!
ఇవి కూడా చదవండి:
Rashmika Mandanna: షూటింగ్‌కు వెళ్లాలంటే.. వణుకు పుట్టింది
మళ్లీ ఏమైందిరా.. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్
Husharu Pittalu: ఒరేయ్.. ఏం సినిమారా ఇది.. ఇంట్లోవాళ్లతో చూస్తే చెప్పుతో కొడతారు