ఇకపై స్కూళ్లు, కాలేజీల్లో సినిమా ప్రమోషన్లు బంద్? తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

ABN , Publish Date - Nov 11 , 2026 | 06:20 AM

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీల్లో సినిమా ప్రమోషన్లు, వాణిజ్య కార్యక్రమాలపై నిషేధం విధించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విద్యార్థుల భద్రత కోసం కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Telangana Government

విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు వేయాల్సిన విద్యాసంస్థలు కట్టు తప్పుతున్నాయి. భవిష్యత్ బాగుండాలని రూ.లక్షలు పోసి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివిస్తున్నారు. కానీ కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు (Schools and Colleges) విద్యార్థులను తమ రాజకీయ, కుటుంబ అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. ఈ క్రమంలో అనేక అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడమే కాకుండా కొన్నిసార్లు విద్యార్థులు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. కొన్ని విద్యాసంస్థల్లో చోటు చేసుకున్న పరిణామాలు ప్రభుత్వంతో పాటు తల్లిదం డ్రులు, విద్యావంతుల్లో ఆందోళన కలిగించాయి. విద్యాసంస్థల యాజమాన్యాలు ఇష్టారీతిగా సెలవులు ప్రకటించడం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకో కుండానే భారీ కార్యక్రమాలు చేపట్టడం పరిపాటిగా మారింది.

ఈ నేపథ్యంలో విద్యాసంస్థల్లో సినిమా, ఇతర ప్రైవేటు కార్యక్రమాల ప్రచారంపై నిషేధం విధించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) యోచిస్తోంది. విద్యాసంస్థలు చట్టపరంగా వారి క్యాంపస్‌లలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు? ఎటు వంటివి నిర్వహించకూడదనే అంశంపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ఇటివలే ప్రభుత్వం విద్యా శాఖాధికారులను ఆదేశించింది. ఈ దిశగా మార్గదర్శకాలు (New Guidelines) సిద్ధమవుతున్నట్టు తెలిసింది. పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాలను విద్య, క్రీడా కార్యక్రమాలకు మినహా సినిమా, ఇతర వాణిజ్య కార్యక్రమాలకు (Cinema Promotions) వినియోగించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొ ననున్నారు. విద్య, క్రీడా కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించాలనుకుంటే.. ఎంతమంది హాజరవుతారు? స్టేజీ నిర్మాణం, రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు, తదితర వివరాలను ముందుగానే స్థానిక విద్యాశాఖ అధికారులు పోలీసులు, అగ్నిమాపక శాఖలకు అందజేయాలి. క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు వందలాది మందితో నిర్వహించే వాటి విషయంలో మాత్రం విద్యాసంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలి. లేనిపక్షంలో భారీ జరిమానాలతో పాటు ఇతర చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేయనున్నారు.

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు..!

కళలు, సంస్కృతి, క్రీడలు, స్టార్టప్ ఈవెంట్లు, ఇతర సృజనాత్మకతకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలంటూ విద్యాసంస్థలను విద్యా శాఖ ఆదేశించింది. గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం, యంగ్ ఇండియా ఫిల్మ్ మేకర్ చాలెంజ్ వంటి కార్యక్రమాలు విద్యాశాఖ నిర్వహించింది. అదే సమయంలో కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు అందుకు భిన్నంగా తాము సూచించిన సినిమాలు చూడాలని, ఆ సినిమా చూసేందుకు సెలవులు సైతం ప్రకటించాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి తీవ్ర నిరసన వ్యక్త మైంది. ఇటీవల ఒక విద్యాసంస్థలో వేదిక కూలి ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడంతో పాటు పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు మార్గదర్శకాలు విడుదల చేయనుంది.

Updated Date - Nov 11 , 2026 | 06:28 AM