Telangana: మార్చి 19న తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల ప్రదానం

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:29 PM

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల కమిటీ ఛైర్మన్లు, సభ్యుల సమావేశం తెలంగాణ డిప్యూటీ సీంఎ భట్టి విక్రమార్కతో సెక్రటేరియట్ లో జరిగింది. మార్చి 19న ఉగాది సందర్భంగా అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది.

Telangana Gaddar Film Awards

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల హడావుడి మొదలైంది. 2025వ సంవత్సరానికి సంబంధించిన అవార్డుల ప్రదానోత్సవాన్ని ఉగాది సందర్భంగా మార్చి 19న అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కమిటీల నియామకం పూర్తయింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 2014 నుండి 2023 వరకూ ఉత్తమ చిత్రాలకు మాత్రమే అవార్డులను అందించిన రాష్ట్ర ప్రభుత్వం 2024వ సంవత్సరం సినిమాలకు గానూ వివిధ కేటగిరిల్లో అవార్డులను అందించింది. అలానే ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి - చక్రపాణి అవార్డులతో పాటు గత యేడాది కొత్తగా పైడి జై రాజ్, టి.ఎల్. కాంతారావు పేరుతో అవార్డులను ఏర్పాటు చేశారు. అయితే ఈసారి అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డ్, సి. నారాయణరెడ్డి ఫిల్మ్ అవార్డులను కొత్త ఇవ్వబోతున్నారు. అలాగే సినిమా అవార్డ్ లలో ఫీచర్ ఫిల్మ్ ఆన్ సోషల్ మెసేజ్ కేటగిరిని అదనంగా చేర్చారు.


ప్రత్యేక అవార్డుల కమిటీ ఛైర్మన్ గా కె. రాఘవేంద్రరావు వ్యవహరిస్తుండగా, యస్. గోపాల్ రెడ్డి, కె.యస్. రామారావు, శివలెంక కృష్ణ ప్రసాద్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కమిటీ మెంబర్స్ గా వ్యవహరించనున్నారు. అలానే ఫీచర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకి సంగీత దర్శకుడు మణిశర్మ కమిటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తుండగా, రోజారమణి, బి.వి.యస్. రవి, ఎం.వి. రఘు, కె. అనుపమ్ రెడ్డి, కె. ఉమామహేశ్వరరావు, సానా యాదిరెడ్డి, విజయ్ సాతా, అశోక్ కుమార్, అనూరాధ, ప్రగతి, ఐ. శ్రీలక్ష్మి, వలి హుస్సేన్, నాగభైరు సుబ్బారావు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సభ్యులుగా వ్యవహరించబోతున్నారు.

ఇక డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిమ్స్ విభాగానికి విజయ్ కనకమేడల కమిటీ ఛైర్మన్ గా బి. రఘు, కె. రామ నారాయణ రాజు, ఖాజా మన్సూర్, మందాడి ఉదయ్ కుమార్, మహ్మద్ షర్ఫుద్దీన్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మెంబర్స్ గా వ్యవహరించనున్నారు. అలానే ఉత్తమ పుస్తకం, క్రిటిక్ అవార్స్ విభాగానికి తనికెళ్ళ భరణి ఛైర్మన్ కాగా, పెద్దింటి అశోక్, పి.వి. రామ్మోహన్ నాయుడు తో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మెంబర్స్ గా ఉంటారు.


ఫిబ్రవరి 5వ తేదీన నామినేషన్స్ గడువు ముగియగానే ఎంట్రీ కి వచ్చిన సినిమాలతో పాటు ఇతర నామినేషన్స్ వివరాలను తెలియచేస్తారు. 2025లో విడుదలైన దాదాపు 220 చిత్రాల నుండి సుమారు 85 సినిమాలు గద్దర్ అవార్డ్స్ లోని వివిధ కేటగిరిలలో ఎంట్రీకి వస్తున్నట్టు తెలిసింది. వీటి స్క్రీనింగ్ ను ఫిబ్రవరి 6వ తేదీ నుండి మొదలు పెట్టబోతున్నారు. ఇదిలా ఉంటే... తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల కమిటీల ఛైర్మన్లు, సభ్యులతో బుధవారం సెక్రటేరియట్ లో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'దేశంలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్నింటికి హైదరాబాద్ ను కేంద్రంగా చేయాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయం అని, చిత్రపరిశ్రమకు ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తూ ఎలాంటి పక్షపాతం లేకుండా అవార్డ్స్ లను క్రమం తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తున్నా'మని తెలిపారు. సినిమాలు కూడా సామాజిక అంశంతో పాటు సందేశాత్మకంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది నుంచి బాలల చిత్రోత్సవాన్ని కూడా హైదరాబాద్ లో నిర్వహించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని భట్టి విక్రమార్క చెప్పారు.

Updated Date - Feb 04 , 2026 | 05:29 PM