ప్రత్యేక గీతం శివోహంలో భరణి!

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:26 PM

తనికెళ్ళ భరణి నటించిన 'శివోహం' గీతం విడుదలైంది. శివరాత్రి కానుకగా యశోకృష్ణ స్వరపర్చిన ఈ గీతాన్ని ఐదు భారతీయ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

Shivoham Song

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మహాశివుడిని పూజిస్తూ రూపొందిన 'శివోహం' (Shivoham) పాట ఆవిష్కరణ ఫిబ్రవరి 9వ తేదీ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగింది. ఈ పాటను రాధాకేశవ్ సమర్పణలో పొత్తపు కేశవరెడ్డి నిర్మించారు. దామురెడ్డి దర్శకత్వం వహించారు. యశోకృష్ణ (Yashokrishna) సంగీతాన్ని అందించిన ఈ పాటను ప్రసిద్ధ మలయాళ గాయకుడు మధు బాలకృష్ణన్ (Madhu Balakrishnan) పాడారు. ఈ పాట తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కీర్తన టీవీలో అందుబాటులో ఉండనుంది. శివోహం పాట ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాదీశ్వరులు శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామివారు, ప్రముఖ నటులు తనికెళ్ల భరణి (Thanikella Bharani), ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja), నటుడు గౌతమ్ రాజు (Goutham Raju) అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తనికెళ్ళ భరణి మాట్లాడుతూ, 'పాతికేళ్ల క్రితం ఆటగదరా శివ అనే పుస్తకం రాశాను. అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ మహాశివుడి గురించి కార్యక్రమం జరిగినా నన్ను అతిథిగా పిలుస్తున్నారు. శివోహం పాటలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. శివ భక్తితో లీనమై ఈ పాటలో నటించాను. ఈ పాటను ఈషా ఫౌండేషన్ ప్రాంగణంలో చిత్రీకరించే అవకాశం కలిగింది. ఈషా శైలజతో మాట్లాడి నేనే పర్మిషన్ ఇప్పించాను. ఈ పాటను వీలైనంత అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు దాము రెడ్డి. సంగీత దర్శకుడు యశోకృష్ణ చక్కగా కంపోజ్ చేశారు. సామాన్య పదాలతో సుద్దాల అశోక్ తేజ దీనిని అద్భుతంగా రాశారు. జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేలా మధు బాలకృష్ణన్ పాడారు. శివోహం పాట భక్తులందరినీ అలరించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.


సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, 'నాతో తొలి పాట రాయించిన వారు తనికెళ్ల భరణి. ఆయన ప్రోత్సాహం లేకుంటే నేను ఇండస్ట్రీకి రాకపోయేవాడిని. భరణీ గారితో పాటు, శంకరభారతి స్వామివారి సమక్షంలో శివోహం పాట ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉంది. బ్రహ్మ కనిపించే తీరు వేరు, శ్రీవిష్ణువు కనిపించే తీరు వేరు అయితే శివుడు కనిపించే తీరు నాకు ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది. శివ రాజధాని కైలాసంలో అందరూ సమానమే. సమసమాజం ఉన్న చోటు అది. అక్కడ పాము ఉంటుంది, ఎలుకా ఉంటుంది. అయితే అవి గొడవలు పడవు. కలిసే ఉంటాయి. ఇలాంటి సమసమాజం మరే దేవుడి రాజధానిలోనూ ఉండదు. అర్థనారీశ్వరుడిలా మనకు శివుడు ఎందుకు దర్శనమిస్తాడంటే భార్య భర్త ఎలా కలిసి ఉండాలో చెప్పేందుకు. ఇలాంటి గొప్ప సందేశం శివుడు మనకు అందిస్తాడు. ఈ పాట నేను రాసిన తర్వాత యశోకృష్ణ స్వరపర్చాడు. ఇలాంటి ఒక మంచి భక్తి గీతాన్ని మీరంతా విని ఆనందించాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు. విద్యాశంకర భారతీ మహాస్వామివారు ఈ సందర్భంగా పాటను రూపకల్పన చేసిన బృందానికి శుభాశీస్సులను అందించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు యశో కృష్ణ, దర్శకుడు దామురెడ్డి, నిర్మాత పొత్తపు కేశవరెడ్డి పాల్గొన్నారు. గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Updated Date - Feb 10 , 2026 | 03:34 PM