Supers Star Krishna: బెజవాడలో.. 'ఈనాడు' సినిమా గెటప్‌లో కృష్ణ విగ్రహం! ఆవిష్కరించిన మనుమడు
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:27 PM
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో ఆదివారం ఆయన మనవడు జయకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాష్ట్రమంత్రులతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna)కు, విజయవాడకు ఎనలేని అనుబంధం ఉంది. కృష్ణ నటించిన 200వ చిత్రం 'ఈనాడు' (Eenadu) ప్రీ క్లయిమాక్స్ సాంగ్, సీన్స్ ను చిత్రీకరించింది విజయవాడలోనే. ఆ సినిమా చిత్రీకరణ జరుపుకున్న అలనాటి అలంకార్ టాకీస్ సెంటర్ లో ఆదివారం కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని 'ఈనాడు' సినిమాలోని గెటప్ లో తీర్చిదిద్దడం విశేషం. కృష్ణ మారణానంతరం పలు పట్టణాలలో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు కృష్ణ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. ఆ జాబితాలో విజయవాడలోని విగ్రహమూ చేరింది.

ఈ కార్యక్రమంలో శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Raghu Ramakrishnam Raju), పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Raveendra), గద్దె రామ్మోహనరావు, బోండా ఉమా, బుద్ద వెంకన్న తో పాటు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, కృష్ణ మనవడు, రమేశ్ బాబు కొడుకు జయకృష్ణ (Jaya Krishna), దర్శకుడు అజయ్ భూపతి, ప్రముఖ నిర్మాతలు అశ్వనీదత్ (Ashwini Dutt), 'జెమినీ' కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహాన్ని మూడోతరం వారసుడు జయకృష్ణ ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ, 'కృష్ణ మించిన సూపర్ స్టార్ మరొకరు ఉండరు. అతి తక్కువ కాలంలో 350 సినిమాలు చేసిన గొప్ప నటుడు కృష్ణ. మూడో తరం వారసుడుగా రమేష్ బాబు కొడుకు జయకృష్ణ వస్తున్నాడు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ బ్యానర్ లో జయకృష్ణ నటించడం చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు.

ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, 'కృష్ణకు విజయవాడకు ఎంతో అనుబంధం ఉంది. మహేష్ బాబు లాగే జయకృష్ణ కూడా సూపర్ స్టార్ గా వెలుగుతాడనే నమ్మకం ఉంది. కృష్ణ నటించిన 'ఈనాడు' సినిమా షూటింగ్ ఇక్కడే జరిగింది. ఆ సినిమా రాష్ట్ర రాజకీయాల చరిత్రను మార్చేసింది' అని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణను చూడగానే అల్లూరి సీతారామరాజే గుర్తొస్తాడని, తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ కృష్ణ' అని అన్నారు. విజయవాడ నడిబొడ్డులో ఈ విగ్రహాన్ని పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని, తెలుగుజాతి ఉన్నత వరకూ కృష్ణ పేరు ఎవరూ మర్చిపోరని, అందరు హీరోలతో కృష్ణకు విడదీయలేని బంధం ఉండేద'ని కొల్లు రవీంద్ర చెప్పారు.
విశేషం ఏమంటే... సరిగ్గా 40 యేళ్ళ క్రితం ఇదే రోజున సూపర్ కృష్ణ హీరోగా అశ్వినీదత్ నిర్మించిన 'అగ్నిపర్వతం' సినిమా విడుదలై ఘన విజయాన్ని సాధించింది. కె. రాఘవేంద్రరావు దీనిని డైరెక్ట్ చేశారు. తాజాగా జెమినీ కిరణ్ తో కలిసి అశ్వనీదత్ కృష్ణ మనవడు జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ 'శ్రీనివాస మంగాపురం' మూవీని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కృష్ణ అభిమానులు పాల్గొన్నారు.
