AIతో పాన్ ఇండియా సినిమా.. 23 ఏళ్ల తర్వాత ‘స్ట్రైకర్’తో దర్శకుడు కిరణ్ కర్నీడి రీ ఎంట్రీ!

ABN , Publish Date - Nov 25 , 2026 | 08:46 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో ‘స్ట్రైకర్’ పాన్ ఇండియా సినిమాను రూపొందించారు దర్శకుడు కిరణ్ కర్నీడి. 23 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పట్టిన ఆయన మూవీ విశేషాలివే.

Striker Movie,

సినిమా నిర్మాణంలో ఆధునిక సాంకేతికత కొత్త మార్పులకు నాంది పలుకుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం సినీ రంగంలో ఆసక్తికర పరిణామాలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఓ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు కిరణ్ కర్నీడి. ‘స్ట్రైకర్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాతో ఆయన మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 25న తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా వివరాలను అధికారికంగా వెల్లడించారు.

2003లో విడుదలైన ‘తొలి పరిచయం’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు కిరణ్ కర్నీడి. ఆ తర్వాత వివిధ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఆయన.. దాదాపు 23 ఏళ్ల విరామం అనంతరం మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ‘స్ట్రైకర్’ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. యూనివర్సల్ మూవీస్ పతాకంపై ఈ పాన్ ఇండియా సినిమాను రూపొందించారు.

విద్యావంతుడైన కిరణ్ కర్నీడి గతంలో ‘గ్లామర్ టాప్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో శాశ్వత సభ్యుడిగా కొనసాగుతున్నారు. మార్కెటింగ్ రంగంలో తనకున్న అనుభవానికి సృజనాత్మకతను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ‘స్ట్రైకర్’ను రూపొందించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. సినిమా నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించడం ద్వారా సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.

శక్తివంతమైన సాంకేతికతకు బలమైన భావోద్వేగాలు, పుష్కలమైన వినోదాన్ని జోడించి ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని కిరణ్ కర్నీడి చెబుతున్నారు. కేవలం సాంకేతిక హంగులకే పరిమితం కాకుండా, సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ అంశాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ‘స్ట్రైకర్’ సినిమా నిర్మాణ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం థియేటర్లలో విడుదల చేసేందుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అయితే సినిమా విడుదల తేదీ, ఇతర నటీనటులు, కథానాయకుల వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించాల్సి ఉంది.

Updated Date - Nov 25 , 2026 | 08:55 PM