కదం తొక్కు.. వీర మహిళ సాంగ్ రిలీజ్‌

ABN , Publish Date - Aug 19 , 2026 | 08:25 PM

జనసేన మహిళలు రాజకీయ రంగంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు స్ఫూర్తినిచ్చే ‘కదిలింది ఇక జనసేన.. కదం తొక్కు వీర మహిళ’ ప్రత్యేక గీతాన్ని మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేశారు.

janasena

మహిళలు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి క్రియాశీలకంగా పనిచేయాలనే ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేక గీతం విడుదలైంది. ‘కదిలింది ఇక జనసేన.. కదం తొక్కు వీర మహిళ’ పేరుతో రూపొందించిన ఈ పాటను పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.

జనసేన (Janasena) పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆశయాలకు అనుగుణంగా మహిళలు రాజకీయాల్లో మరింత ముందుకు సాగాలనే లక్ష్యంతో ఈ పాటను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. జనసేన మహిళా కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు ప్రజాస్వామ్య పోరాటంలో మహిళల పాత్రను చాటి చెప్పేలా గీతాన్ని తీర్చిదిద్దారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) మాట్లాడుతూ.. మహిళా శక్తికి, వారి పోరాట పటిమకు ప్రతీకగా ఈ గీతం నిలుస్తుందని అన్నారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జనసేన వీర మహిళల సాహసం, ప్రజా సమస్యలపై వారి పోరాటాన్ని గుర్తుచేసేలా పాటను రూపొందించడం అభినందనీయమని అన్నారు.

కృష్ణా-పెన్నా రీజినల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విజయవాడ 43వ డివిజన్ పార్టీ కోఆర్డినేటర్, విజయేశ్వర స్వామి దేవాలయ బోర్డు సభ్యురాలు ఆలమూరి శ్రీదేవి ఈ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. కార్యక్రమంలో పలువురు జనసేన మహిళా నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2026 | 08:51 PM