Tollywood: త్రివిక్రమ్ చేతుల మీదుగా సీతారామశాస్త్రి విగ్రహవిష్కరణ

ABN , Publish Date - Jan 26 , 2026 | 06:07 PM

ప్రముఖ సినీ గీత రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి విగ్రహావిష్కరణ అనకాపల్లిలో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, సీతారామశాస్త్రి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Sirivennela Seetharama Sastry

తానా సాహిత్య విభాగం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో సిరివెన్నెల కళాపీఠం సహకారంతో అనకాపల్లిలో జనవరి 25వ తేదీ పద్మశ్రీ అవార్డు గ్రహీత, సినీ గీత రచయిత స్వర్గీయ 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి విగ్రహావిష్కరణ జరిగింది. సీతారామశాస్త్రి కాంస్య విగ్రహాన్ని ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించగా, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పెంటకోట కన్వెన్షన్ లో జరిగిన సభకు అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'రథసప్తమి రోజున అనకాపల్లి లో పుట్టి, అనకాపల్లి లో పెరిగి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక సాహిత్య వేత్తగా గౌరవాన్ని తీసుకొచ్చిన 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడం ఆనందంగా ఉంది. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి కళాపీఠం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇవ్వాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని, ఈ ఏడాది విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కుటుంబ సభ్యులతో కలిసి పూర్తి చేయడం జరిగిందని, విగ్రహ ఏర్పాటుకు తానా ప్రపంచ సాహిత్య వేదిక వారు సహకారం అందించారని కొణతాల రామకృష్ణ అన్నారు.


ప్రముఖ సినీ దర్శకులు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, 'జీవంతో ఉన్నా లేకున్నా మనుషుల మనసుల్లో సజీవం గా నిలిచేది కొందరే' అని అన్నారు. అలాంటి వారిలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒకరని చెప్పారు. అనకాపల్లి... సిరివెన్నెల వంటి వారి ఎందరికో పుట్టినిల్లు అని, మహనీయుల చరిత్ర తర్వాత తరాల వారికి తెలియాలన్న, స్పూర్తి పొందాలన్నా ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు అవసరమన్నారు.

WhatsApp Image 2026-01-25 at 9.03.21 PM.jpeg


మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, 'తెలుగు సినిమా చరిత్రలో తెలుగు సాహిత్యాన్ని పరుగులు పెట్టించిన వ్యక్తి సిరివెన్నెల' అని అన్నారు. మానవీయ విలువలను ప్రతిబింబించేలా ఆయన పాటలు సాగాయన్నారు. తానా సభ్యులు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ, 'టెలికాం సంస్థలో ఉద్యోగం వదిలేసి సినీ ఇండస్రీ లోకి అడుగుపెట్టడం సాహసమని, 'సిరివెన్నెల' చిత్రంతో సీతారామశాస్త్రి తనకంటూ ఓ ప్రత్యేకతతో చరిత్ర సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, సత్యారావు మాస్టారు, సీతారామశాస్త్రి సతీమణి పద్మావతి, సోదరులు శ్రీరామశాస్త్రి, వెంకటరామ శాస్త్రి, సీతారామశాస్త్రి కుమార్తె, కుమారులు పాల్గొన్నారు. జనసేన ఇన్ ఛార్జ్ రాంకీ కార్యక్రమం సజావుగా సాగేలా పర్యవేక్షించారు.

WhatsApp Image 2026-01-25 at 9.04.03 PM.jpeg

ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Updated Date - Jan 26 , 2026 | 07:21 PM