Tollywood: అనకాపల్లిలో సీతారామశాస్త్రి కాంస్య విగ్రహం!

ABN , Publish Date - Jan 22 , 2026 | 01:55 PM

ప్రముఖ గీత రచయిత, స్వర్గీయ 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి కాంస్య విగ్రహాన్ని అనకాపల్లిలో ఈ నెల 25న ఆవిష్కరించ బోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా జరిగే ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎం.పి. సి.ఎం. రమేశ్‌ పాల్గొంటున్నారు.

Sirivennela Seetha Rama Sastry

ప్రముఖ గీత రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత, స్వర్గీయ 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి (Sirivinnela Seetharama Sastry) కాంస్య విగ్రహాన్ని అనకాపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సహకారంతో తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జనవరి 25వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు, అనకాపల్లి గాంధీనగర్ లో 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి విగ్రహాన్ని ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఆవిష్కరించబోతున్నారు.

అనంతరం పెంటకోట కన్వెన్షన్ సెంటర్ లో జరిగే కార్యక్రమానికి అనకాపల్లి శాసన సభ్యులు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ (Konathala Ramakrishna) అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సి.ఎం. రమేశ్‌ (C.M. Ramesh) హాజరు కానున్నారు.


ఈ కార్యక్రమానికి అవనిగడ్డ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ (Mandali Buddha Prasad), తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, లావు అంజయ్య చౌదరి, జి.వి.ఎం.సి. మేయర్ పీలా శ్రీనివాసరావు గౌరవ అతిథులుగా హాజరు కానున్నారు. విశిష్ట అతిథులుగా పీలా గోవింద సత్యనారాయణ, విజయ కృష్ణన్, కేతన్ గార్గ్, యర్రంశెట్టి సత్యారావు (మాస్టారు) హాజరవుతారు. ఈ కార్యక్రమంలో సీతారామశాస్త్రి సతీమణి చేంబోలు పద్మావతి, సోదరులు శ్రీరామశాస్త్రి, వెంకటరామశాస్త్రి పాల్గొంటారు. అలానే ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry), దర్శకులు వి.ఎన్. ఆదిత్య (V.N. Aditya), మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, జీడిగుంట విజయసారధి, ఎర్రాప్రగడ రామకృష్ణ, మల్ల సురేంద్ర, దల్లి గోవిందరావు, మందపాటి సునీత, చక్రవర్తి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నారు. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి కాంస్య విగ్రహాన్ని బుర్రా శివ వర ప్రసాద్ రూపొందించారు.

Updated Date - Jan 22 , 2026 | 02:35 PM