వెండితెర నవలలు... రీ-ప్రింట్ అవుతున్నాయ్!

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:23 PM

ఒకప్పుడు సినిమాలకు వెండితెర నవలలు వచ్చేవి. అప్పట్లో విశేషంగా పాఠకులు ఆదరణ పొందిన వెండితెర నవలలను ఇప్పుడు కొందరు పునర్ ముద్రిస్తుండటం విశేషం.

Venditera Novels

సినిమాలు రీ-రిలీజ్ అవడం కొత్త కాదు... పైగా ఇప్పుడది ఓ ట్రెండ్‌గా మారిపోయింది. ప్రతి నెలలోనూ ఒకటి రెండు సినిమాలు రీ-రిలీజ్ (Re-release) అవుతున్నాయి. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలనే కాకుండా హిట్ కాని సినిమాలనూ రీ-రిలీజ్ చేస్తున్నారు. అందులో కొన్ని మంచి కలెక్షన్స్‌నూ రాబడుతున్నాయి. ఇక తెలుగు సాహిత్యం విషయానికి వస్తే... సినిమాల్లానే పాపులర్ రచయితల నవలలు కూడా రీ-ప్రింట్ అవుతున్నాయి. చదువరులు తగ్గిపోయారని ఓ పక్క సర్వేలు చెబుతున్నా, పుస్తకాల ప్రచురణకు ఇప్పటికీ మంచి ఆదరణే ఉంది. ఈ మధ్య కాలంలో సినిమా సాహిత్యానికి మంచి ఆదరణ లభిస్తోందని బుక్ ఎగ్జిబిషన్స్‌లో జరుగుతున్న అమ్మకాలను పరిశీలిస్తే అర్థమౌతుంది.

దాదాపు అరవై, డబ్బై సంవత్సరాల క్రితం తెలుగు సినిమా రంగంలో వెండితెర నవల అనే కల్చర్ ఉండేది. అప్పట్లో ప్రతి సినిమాకు సంబంధించిన పాటల పుస్తకాలు వస్తుండేవి. అభిరుచి ఉన్న దర్శక నిర్మాతలైతే... తమ సినిమా మేకింగ్ విశేషాలు తెలియచేస్తూ వెండితెర నవలను కూడా ప్రచురిస్తూ ఉండేవారు. అయితే ప్రస్తుతం ఆ ప్రక్రియ తెరమరుగైపోయింది. విశేషం ఏమంటే.. గతంలో వచ్చిన వెండితెర నవలలు ఇప్పుడు రీ-ప్రింట్ అవుతున్నాయి. పాత కాపీలు అందుబాటులో లేకపోవడంతో... ఈ జనరేషన్‌కు వెండితెర నవలను పరిచయం చేయాలని ప్రచురణ కర్తలు కొందరు భావిస్తున్నారు.


శాంతా బయోటిక్స్ అధినేత కె. ఇ. వరప్రసాద్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ రాజా సంపాదకత్వంలో 'హాసం' (Hasam) పక్ష పత్రికను తీసుకొచ్చినప్పుడు అందులో అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) నటించిన 'ఇద్దరు మిత్రులు, వెలుగు నీడలు, భార్యభర్తలు' వెండితెర నవలలను సీరియల్‌గా ప్రచురించారు. వీటిని ప్రముఖ రచయిత, నిర్మాత ముళ్ళపూడి వెంకట రమణ రాశారు. ఆ మధ్య ఈ మూడు వెండితెర నవలలను హాసం ప్రచురణలు రీ-ప్రింట్ చేసింది. అలానే ఎన్టీఆర్ (NTR) నటించిన 'శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం', 'మాయాబజార్' (Maya Bazar), 'మల్లీశ్వరి' (Malliswari) వెండితెర నవలలు సైతం గతంలో రీ-ప్రింట్ అయ్యాయి. దర్శకులు వంశీ తన సినిమాలకు వెండితెర నవలలు రాయడమే కాకుండా... 'తాయారమ్మ-బంగారయ్య', 'శంకరాభరణం' (Sankarabharanam), 'సీతాకోక చిలుక' (Sithakoka Chiluka), 'శుభోదయం' వంటి చిత్రాలకు వెండితెర నవలలు రాశారు. వీటిలో 'శంకరాభరణం, సీతాకోక చిలుక, శుభోదయం, అన్వేషణ' చిత్రాల వెండితెర నవలలు అన్నింటినీ కలిపి సాహితీ ప్రచురణలు సంస్థ ఒకే పుస్తకంగా తీసుకొచ్చింది. శ్రీరమణ (Sreeramana) రాసిన వెండితెర నవలలు 'వంశవృక్షం', 'త్యాగయ్య'లను ఇటీవల పునర్ ముద్రించారు.

vendi copy.jpg

గత యేడాది 'ముత్యాల ముగ్గు' యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్షజ్ఞ ప్రచురణ సంస్థ ఆ సినిమా వెండితెర నవలను పునర్ ముద్రించింది. ఆ సినిమా నిర్మాత, ప్రముఖ రచయిత స్వర్గీయ ఎమ్వీయల్ దీన్ని అప్పట్లో రాశారు. ఇక ఈ యేడాది 19న కళాతపస్వి కె. విశ్వనాథ్‌ జయంతిని పురస్కరించుకుని వంశీ అప్పట్లో రాసిన 'శంకరాభరణం' వెండితెర నవలను కె. విశ్వనాథ్‌ తనయుడు కె. నరేంద్ర నాథ్‌ పునర్ ముద్రించారు. ఇది ఇప్పుడు మార్కెట్లో ఉంది. ఈ తాజా వెండితెర నవలలో దర్శకుడు వంశీ ఎ.ఐ. టెక్నాలజీ ఉపయోగించి, పాత ఫోటోలను రీ-క్రియేట్ చేసి పొందుపరిచారు. ఏదేమైనా... తెలుగు సినిమా స్వర్ణయుగం నాటి వెండితెర నవలలు ఇప్పుడు రీ-ప్రింట్ కావడం, పాఠకుల ఆదరణను పొందడం విశేషమే.

Updated Date - Feb 27 , 2026 | 04:23 PM