సీబీఎఫ్‌సీ ఛైర్మన్‌గా శశిశేఖర్ వెంపటి!
ABN , Publish Date - May 07 , 2026 | 11:17 AM
సీబీఎఫ్‌సీ ఛైర్మన్ గా తెలుగువారైన శశి శేఖర్ వెంపటిని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నియమించింది. ఆయన ఈ పదవిలో మూడు సంవత్సరాలు ఉంటారు.
దాదాపు తొమ్మిదేళ్ళ పాటు సీబీఎఫ్‌సీ ఛైర్మన్ గా ఉన్న ప్రసూన్ జోషీకి మే 2న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రసారభారతి ఛైర్మన్‌గా పదోన్నతి కల్పించింది. దాంతో ఖాళీ అయిన సీబీఎఫ్‌సీ ఛైర్మన్ పదవికి తెలుగు వారైన శశిశేఖర్ వెంపటిని నియమిస్తూ బుధవారం కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓ తెలుగు వ్యక్తి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) కు ఛైర్మన్ కావడం ఇదే మొదటిసారి. పదవిలో చేరిన తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు శశిశేఖర్ వెంపటి ఈ బాధ్యతలను నిర్వహించనున్నారు.
మీడియా, ప్రసార రంగం, ప్రజా కమ్యూనికేషన్‌లో విశేష అనుభవం ఉన్న వ్యక్తి శశిశేఖర్ వెంపటి. ఆయన నియామకంతో సీబీఎఫ్‌సీ పనితీరు మరింత గొప్పగా ఉంటుందనే ఆశాభావాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసింది.
ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి అయిన శశి శేఖర్ వెంపటి 2017 నుంచి 2022 వరకు ప్రసార భారతి సీఈఓగా పనిచేశారు. దానితో పాటే 2017 ఆగస్టు నుంచి 2019 మే వరకు రాజ్యసభ సచివాలయ సీఈఓగా అదనపు బాధ్యతలను కూడా నిర్వర్తించారు.
‘డీప్‌టెక్ ఫర్ భారత్ ఫౌండేషన్’ సహ వ్యవస్థాపకుడిగా శశి, ‘ఎ.ఐ.4 ఇండియా’ కార్యక్రమం ద్వారా భారత కృత్రిమ మేధస్సు (AI) వ్యవస్థ అభివృద్ధికి కృషి చేశారు. ఆయన భారత ప్రభుత్వ విజ్ఞాన, సాంకేతిక శాఖ (DST) సైన్స్ & టెక్నాలజీ కమ్యూనికేషన్ కమిటీ చైర్‌పర్సన్‌గా, యూజీసీ విద్యా మీడియా నిపుణుల కమిటీ చైర్‌పర్సన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ (IIMC), జామియా విశ్వవిద్యాలయం ఏజేకే మాస్ కమ్యూనికేషన్ & మీడియా రీసెర్చ్ సెంటర్ వంటి సంస్థల బోర్డులకు కూడా ఆయన మార్గదర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రసార ప్రమాణాల సంస్థ ఎటిఎస్‌సి గ్లోబల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు.
ప్రసార భారతి సీఈఓగా ఉన్న సమయంలో దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో ఆధునీకరణకు కీలక సంస్కరణలను తీసుకువచ్చిన ఆయన, అదే సమయంలో రాజ్యసభ టీవీని కూడా సమర్థంగా నడిపించారు. ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి అయిన శశి, ‘కలెక్టివ్ స్పిరిట్ కాంక్రిట్ యాక్షన్ - మన్ కీ బాద్ అండ్ ఇట్స్ ఇన్ ఫ్లుయెన్స్ ఆన్ ఇండియా' అనే పుస్తకాన్ని రాశారు. గత కొంతకాలంగా సినిమా రంగంలో సీబీఎఫ్‌సీ తీసుకుంటున్న చర్యలు చర్చనీయాంశంగా మారాయి. అలానే కొన్ని సినిమాల విషయంలో సీబీఎఫ్‌సీ పక్షపాత ధోరణితో ప్రవర్తించిందనే ఆరోపణలూ వచ్చాయి. ఇప్పుడు తెలుగు వారు, సమర్థులు అయిన శశిశేఖర్ వెంపటి ఆ సంస్థకు ఛైర్మన్ కావడంతో అటువంటి వాటికి చెక్ పెడతారేమో చూడాలి.