RSS: విక్టరీ వెంకటేశ్ ఇంటికి.. RSS మోహన్ భగవత్! నాగార్జున, అల్లు అరవింద్ సైతం
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:14 PM
సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ ఇంటిలో ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్ సినీ ప్రముఖులతో ఇటీవల సమావేశమయ్యారు. వందేళ్ళు పూర్తి చేసుకున్న ఆర్.ఎస్.ఎస్. నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వారికి ఆయన వివరించారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ సర్ సంఘచాలక్ (అధ్యక్షులు) మోహన్ భగవత్ (Mohan Bhagawath) దేశ వ్యాప్తంగా వివిధ నగరాలలో పలు సమావేశాలకు హాజరవుతున్నారు. అందులో భాగంగా ఇటీవల హైదరాబాద్ లోనూ కొన్ని కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. సినీ, సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన ప్రముఖులతో ఆయన ఆదివారం నోవాటెల్ లోని హెచ్.ఐ.సి.సి.లో సమావేశం అయ్యారు.
అయితే దీనికి ఒక రోజు ముందు శనివారం సాయంత్రం హీరో వెంకటేశ్ (Venkatesh) ఇంటిలో ఆయన పలువురు సినీ ప్రముఖులను కలుసుకున్నారు. దీనికి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తో పాటు యువ కథానాయకులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు హాజరయ్యారు. ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన మురళీమోహన్ (Murali Mohan), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ తో పాటు అల్లు అరవింద్ (Allu Aravind), దిల్ రాజు (Dil Raju), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), బ్రహ్మానందం, తమ్మారెడ్డి భరద్వాజ, మంచు విష్ణు, మనోజ్ తదితరులు దీనికి హాజరయ్యారు.
ఆర్.ఎస్.ఎస్. చేస్తున్న సేవా కార్యక్రమాలను సినీ ప్రముఖులకు మోహన్ భగవత్ వివరిస్తూ, సమాజం గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని చెబుతూ, సంఘ కార్యక్రమాలలో పాలు పంచుకోవాల్సిందిగా కోరారు. ఎవరైనా సమాజ హితం కోసం పని చేస్తే వారికి స్వయం సేవకులు తోడ్పడతారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్. కేంద్ర కార్యకారిణి సభ్యులు భాగయ్య, క్షేత్ర ప్రచారక్ భరత్, అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, సంపర్క్ ప్రముఖ్ రామ్ లాల్, తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీధర్, ప్రాంత కార్యవాహ్ కాచం రమేశ్, కె.కె.వి. శర్మ తదితరులు పాల్గొన్నారు.