Tollywood: సీనియర్ కో-డైరెక్టర్ దేవినేని రవికుమార్ కన్నుమూత
ABN , Publish Date - Apr 20 , 2026 | 11:56 AM
సీనియర్ కో-డైరెక్టర్ దేవినేని రవికుమార్ కన్నుమూశారు. శరత్ దగ్గర పలు చిత్రాలకు కో-డైరెక్టర్ గా పనిచేసిన రవికుమార్ స్నేహశీలి అని ఆయన సహచరులు తెలిపారు.
తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. శనివారం తెలుగు సినిమా రంగానికి చెందిన ఎడిటర్ మధురెడ్డి గుండెపోటుతో కన్నుమూయగా... ఆదివారం సీనియర్ కో-డైరెక్టర్ దేవినేని రవికుమార్ చనిపోయారు. సీనియర్ దర్శకుడు, స్వర్గీయ శరత్ వద్ద దేవినేని రవికుమార్ దశాబ్దాల పాటు దర్శకత్వ శాఖలో పనిచేశారు. సుమన్ నటించిన పలు చిత్రాలకూ దేవినేని రవి కో-డైరెక్టర్‌గా వర్క్ చేశారు. అలానే ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ నిర్మించిన చిత్రాలకు ప్రొడక్షన్ వ్యవహారాలను దేవినేని రవి చక్కబెడుతూ ఉండేవారు. 'సినిమా రూపకల్పనలో యూనిట్ సభ్యులందరికీ తలలో నాలుక మాదిరి దేవినేని రవి మెలిగేవార'ని తెలుగు దర్శకుల సంఘం మాజీ అధ్యక్షులు, నట దర్శకుడు కాశీ విశ్వనాథ్ తెలిపారు. తాను కూడా దేవినేని రవితో పాటు శరత్ దగ్గర అప్పట్లో దర్శకత్వ శాఖలో పనిచేశానని, రవి అందరినీ కలుపుకుని ముందుకు సాగేవారని అన్నారు. దేవినేని రవి మృతి పట్ల దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య సంతాపం తెలిపారు.
దేవినేని రవి కుమార్ మృతదేహాన్ని విజయవాడలోని ఆయన స్వగృహానికి ఆదివారం రాత్రి తీసుకెళ్ళారు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉన్న కుమార్తె భారత్‌కు రాగానే ఈ నెల 22న విజయవాడలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.