డ్రగ్స్ మాఫియాపై పోరాటం.. ‘స్కాలర్’ ఫస్ట్ లుక్ రిలీజ్!

ABN , Publish Date - Nov 17 , 2026 | 10:38 AM

చిల్డ్రన్స్ డే సందర్భంగా కౌశిక్, ప్రతిభా సిన్హా జంటగా నటిస్తున్న ‘స్కాలర్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.

యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్, గంజాయి మహమ్మారిపై అవగాహన కల్పించడంతో పాటు ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘స్కాలర్’. చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్ వేదికగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలిమ్స్, రామకృష్ణారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కౌశిక్, ప్రతిభా సిన్హా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ గౌడ్, పెంచల్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో పలు సందేశాత్మక బాలల చిత్రాలను రూపొందించిన డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూత్‌ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా, సామాజిక సందేశంతో ‘స్కాలర్’ను తెరకెక్కిస్తున్నారు.

ఈ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి బి.జి.ఆర్ మైనింగ్ డైరెక్టర్ బాలకోటి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూబ్లీహిల్స్ క్లబ్ ప్రెసిడెంట్ చక్రవర్తి రెడ్డి, రామకృష్ణారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ పెంచల్ రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ.. నేటి యువతను తప్పుదోవ పట్టిస్తున్న డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల నుంచి వారిని ఎలా కాపాడాలనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి ఓ యువకుడు ప్రత్యేకమైన డ్రగ్‌ను కనిపెట్టడం, తద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఈ కథలో కీలక అంశమని వివరించారు.

అయితే డ్రగ్ మాఫియా అతని కుటుంబాన్ని, సోదరిని లక్ష్యంగా చేసుకోవడంతో కథలో కీలక మలుపులు చోటుచేసుకుంటాయని చెప్పారు. ఆ తర్వాత ఆ మాఫియాను ఆ యువకుడు ఆధ్యాత్మిక నేపథ్యంతో ఎలా ఎదుర్కొని అంతం చేస్తాడనే ఉత్కంఠభరితమైన అంశాలతో సినిమా సాగుతుందని వెల్లడించారు. త్వరలోనే షూటింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటిస్తామని తెలిపారు.

సినిమా ఫస్ట్ లుక్ వేడుకతో పాటు చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఫిలింనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు ఇతర పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు మెమెంటోలు, బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. సామాజిక సమస్యను ఆసక్తికరమైన కథతో మేళవిస్తూ రూపొందుతున్న ‘స్కాలర్’ సినిమా ఫస్ట్ లుక్ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను చిత్ర బృందం వెల్లడించనుంది.

Updated Date - Nov 17 , 2026 | 10:38 AM