వర్మ.. ఎంతకు తెగించావ్! రాజమౌళి, మహేశ్ కొట్టుకునేలా చేస్తావా!
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:22 PM
మహేశ్ బాబు, రాజమౌళి కొట్టుకుంటున్న ఓ ఎ.ఐ. జనరేటెడ్ వీడియోను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఇది కాస్త వైరల్ అయ్యింది.
ఇవాళ ఎ.ఐ. (A.I) ను పాజిటివ్‌గా ఉపయోగిస్తున్న వాళ్ళకంటే నెగెటివ్‌గా ఉపయోగిస్తున్న వాళ్ళే ఎక్కువ. ఎ.ఐ. ద్వారా ఏదైనా సాధ్యమే అని గ్రహించిన టెక్కీలు ఏకంగా సినిమాలు కూడా తీసేశారు. దాంతో సినిమా భవిష్యత్తుపై నీలి నీడలు అలుము కుంటున్నాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ ఎ.ఐ. ఎక్స్ పర్ట్ చేసిన చిన్నపాటి వీడియోను వర్మ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇందులో మహేశ్ బాబు, దర్శకుడు రాజమౌళి కాలర్స్ పట్టుకుని ఒకరితో ఒకరు ఫైట్ చేస్తున్న దృశ్యాలు చిత్రీకరించారు. పూర్తిగా ఎ.ఐ.తో రూపుదిద్దుకున్న ఈ వీడియోను వర్మ షేర్ చేస్తూ, 'సినిమా ఈజ్ డెడ్' అని కామెంట్ పెట్టారు.
చక్కని క్వాలిటీతో ఎ.ఐ.లో అన్నింటినీ పిక్చరైజ్ చేసేస్తున్న తర్వాత ఇక కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీయాల్సిన అవసరం ఏముంది? అన్నది రామ్ గోపాల్ వర్మ భావన కావచ్చు. అయితే... ఎవరో కావాలని చేసిన ఈ వీడియోను సినిమా వాడై ఉండి వర్మ ఎలా పోస్ట్ చేస్తాడని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు. ఇక కొందరైతే... మహేశ్, రాజమౌళి మధ్య పాస్ పోర్ట్ గొడవలా ఉంది ఇది! అని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఓ పక్క మహేశ్ హీరోగా... రాజమౌళి పాన్ వరల్డ్ మూవీగా 'వారణాసి'ని రూపొందిస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ ఇలా గొడవ పడుతున్నట్టు వీడియోను ఎ.ఐ.లో క్రియేట్ చేసి ఇలా పెట్టడం ఎంతవరకూ సబబు అని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు. మరి వర్మ ఈ వీడియోను ఉంచుతారా... లేకపోతే తొలగిస్తారా అనేది చూడాలి.