Vijay: కరుణానిధి సైతం ఊహించి ఉండరు!
ABN , Publish Date - May 06 , 2026 | 01:10 PM
తమిళనాట విజయ్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకున్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఓ పాత ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదిప్పుడు వైరల్‌గా మారింది.
ఇళయ దళపతి విజయ్ (Vijay) అందుకున్న విజయం మామూలుది కాదు! ఎవరూ ఊహించని విజయాన్ని అతను అందుకున్నాడు. అధికారం హస్తగతం చేసుకోవడానికి కేవలం పది సీట్ల దూరంలో విజయ్ ఆగిపోయినా... అతన్ని కాదనే పరిస్థితి ఎవరికీ లేదు. అందుకే సీఎంగా పట్టాభిషిక్తుడు కావడానికి విజయ్ రెడీ అయిపోతున్నాడు. ఇదే సమయంలో విజయ్ పాత ఫోటో ఒకటి ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడది వైరల్‌గా మారింది.
వర్మ పోస్ట్ చేసిన ఫోటోలో తమిళనాడు సీఎం, స్వర్గీయ ఎం. కరుణానిధి ఓ ప్రారంభోత్సవంలో రిబ్బన్ కట్ చేస్తుంటే... ఆయన వెనుక విజయ్ నిలబడి ఉన్నాడు. కరుణానిధికి అటూ ఇటూ విజయ్ తండ్రి చంద్రశేఖర్, ఆయన భార్య ఉన్నారు. ఆ ఫోటోను బట్టి అప్పట్లో విజయ్‌కు 16 సంవత్సరాలు ఉండొచ్చు అనిపిస్తోంది. చిత్రం ఏమంటే... బహుశా అప్పట్లో కరుణానిధి కూడా ఊహించి ఉండరు. తన పక్కన నిలుచున్న వ్యక్తి హీరో అవుతాడని, తమిళ ప్రజలు అతన్ని సూపర్ స్టార్ చేస్తారని! ఇంకా గమ్మత్తైన విషయం ఏమంటే... ఆ స్టార్ హీరో పార్టీ పెట్టి, తన పార్టీనే మట్టి కరిపిస్తాడని ఊహించి కూడా ఉండరు. ఓడలు బళ్ళు... బళ్ళు ఓడలు కావడం అంటే ఇదే కదా అని ఆ ఫోటోను చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవాళ స్టాలిన్ ఆ ఫోటోను చూసి ఎంతగా కుమిలిపోయి ఉండేవాడో అని అంటున్నారు.
కరుణానిధి (Karunanidhi) రాజకీయ వారసుడిగా స్టాలిన్ (Stalin) అంచలంచెలుగా ఎదిగి సీఎం అయ్యాడు. అందుకోసం ఎంతో కసరత్తు చేశాడు. కానీ హీరో విజయ్ సింపుల్‌గా రాజకీయ పార్టీని స్థాపించి, ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా... ఇవాళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాట స్థిరంగా నిలిచాడు. మొత్తానికి ఆర్జీవీ పోస్ట్ చేసిన ఆ ఫోటో కొంతమందిలో జోష్ నింపితే... మరి కొంతమందిలో నిరాశ కలిగించింది.