రజనీకాంత్ ఆగ్ర‌హం.. ఒంటరైన విజ‌య్‌! తమిళనాట వేడెక్కిన రాజకీయాలు

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:26 PM

వివాదాలకు దూరంగా ఉండే రజనీకాంత్‌కు కోపం తెప్పించారు టీవీకే నాయకుడు అర్జున. డీఎంకేకు భయపడే రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉన్నారని ఆయన విమర్శించ డాన్ని పలు పార్టీలు తప్పుపట్టాయి. దీనిపై రజనీకాంత్ స్పందించారు.

Rajinikanth

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించిన వేళ ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. స్టార్ హీరో విజయ్‌ (Vijay) తొలిసారి తమ పార్టీ అభ్యర్థులను ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దించబోతున్నారు. ఈ సందర్భంగా అధికార డీఎంకేపై విమర్శల దాడిని ముమ్మరం చేశారు. ఇటీవల ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అధవ్‌ అర్జున మాట్లాడుతూ, 'రజనీకాంత్ (Rajinikanth) రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు డీఎంకే (DMK) ఆయన్ని భయపెట్టిందని, దాంతో ఆయన వెనక్కి తగ్గార'ని విమర్శించారు. విజయ్‌ అధికార పార్టీతో ఎలాంటి పోరాటమైనా చేస్తాడు అని చెప్పడం కోసం రజనీకాంత్‌ను అర్జున విమర్శించారు. అయితే రజనీకాంత్ లాంటి వ్యక్తిని తమ రాజకీయ ప్రలోభాలకోసం వాడటం ఎంత మాత్రం సరికాదంటూ ఇతర రాజకీయ పార్టీల నేతలు టీవీకే ప్రధాన కార్యదర్శిని విమర్శిస్తున్నారు. తనపై విజయ్ పార్టీ నేత చేసిన విమర్శలకు ప్రతిస్పందనగా ఘాటుగా బదులిచ్చిన వారికి రజనీకాంత్ తాజాగా ధన్యవాదాలు తెలిపారు. ఓ లేఖలో తన మనసులోని మాటలను తెలియచేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

rajini.jfif


ఆ లేఖలో రజనీకాంత్ ఇలా పేర్కొన్నారు. 'తమిళనాడు రాజకీయాల్లో ఉన్న ఒక నేత ఇటీవల నా గురించి నిజానికి విరుద్ధమైన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఆ అవమానకర వ్యాఖ్యను ఖండిస్తున్నాను. ఈ సందర్బంగా నాకు మద్దతుగా నిలిచిన సర్వశ్రీ తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామికి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్‌కు, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ కు, రాష్ట్ర మంత్రి రఘుపతికి, నా స్నేహితుడు అన్నామలైకు, అర్జునమూర్తికి, అన్బుమణి రామదాస్‌కు, జి.కె. వాసన్ తదితరులందరికీ, అలానే వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, సినీ రంగానికి చెందిన స్నేహితులకు, నక్కీరన్ గోపాల్‌కు, రంగరాజ్ పాండేకు, మీడియా ప్రతినిధులకు, నన్ను ప్రేమించే అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని పేర్కొన్నారు. ఈ లేఖ చివరిలో ఆయన 'కాలం మాట్లాడదు కానీ సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతుంది' అని పేర్కొనడం విశేషం.

poster.jpg

రజనీకాంత్ విడుదల చేసిన ఈ లేఖతో ఒక్కసారిగా విజయ్‌ పార్టీ ఒంటరి అయిపోయింది. పైగా రాష్ట్ర వ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు విజయ్ పార్టీ నేతలను బాహాటంగా విమర్శి స్తున్నారు. మదురైలో రజనీకాంత్ ఫ్యాన్స్ ఆయనకు సపోర్ట్ గా, టివికెకు వ్యతిరేకంగా పోస్టర్స్ వేశారు. మరి విజయ్‌ పార్టీ ఈ పొరపాటుకు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో చూడాలి.

Updated Date - Mar 18 , 2026 | 02:25 PM