కొత్త సినిమాల.. పైరసీ గుట్టు రట్టు! థియేటర్లలో రికార్డింగ్.. ఒక్కో సినిమాకు రూ.20 వేలు!

ABN , Publish Date - Nov 22 , 2026 | 08:44 AM

టాలీవుడ్‌ను వణికిస్తున్న సినిమా పైరసీ ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రట్టు చేశారు.

Movie Piracy

సినిమాల పైరసీ (Movie Piracy) ముఠా గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Cyber Security Bureau) అధికారులు రట్టు చేశారు. తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన యాంటీ పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసిన అధికారులు.. 24 గంటల్లోనే పైరసీ రాకెట్‌లో కీలకమైన ఇద్దరిని ఏపీలోని కర్నూలులో అరెస్టు చేశారు.

కర్నూలులో సిటీ స్క్వేర్ మాల్‌లో ఉన్న ఎస్వీసీ సినిమాన్ నుంచి కర్నూలుకు చెందిన షేక్ రిజ్వాన్‌, రాంపోగు అజయ్‌లు కొత్తగా విడుదలైన సినిమాలను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసి గోఫైల్.కామ్ వెబ్‌సైట్‌లో ఆప్ లోడ్ చేస్తున్నారు. ఆ వెంటనే పైరసీ రాకెట్ ముఠా ఈ సినిమాలను గో2 ఇండియా 4 మూవీస్ క్లిక్ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు.

ఈ వెబ్‌సైట్‌లో ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించిన ప్రకటనలు ఇస్తూ బెట్టింగ్ వైపు యువతను ఆకర్షిస్తున్నారు. ఇటీ వల విడుదలైన రామాయణ, సీన్, మహాశక్తి, ఈఎన్ ఈ రిపీట్, ఆకాశంలో ఒక తార, ఓం, కల్ట్‌, ఆదర్శ కుటుంబం సినిమాలను వీరు రహస్యంగా చిత్రీకరించి ఒకొక్క సినిమాను రూ.20 వేలకు అమ్ముకున్నారు. పైరసీ సినిమాలను కొనుగోలు చేస్తున్న ముఠా ( Film Piracy Gang) అప్లోడ్ చేసిన ప్రతి సినిమాకు రూ.20 వేలను క్రిప్టో కరెన్సీ (Crypto Currency) రూపంలో వీరి వాలెట్లకు బదిలీ చేస్తున్నారు.

సినిమాలను కొనుగోలు చేస్తున్న వారిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ (Shikha Goel) తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో కలిసి యాంటీ పైరసీ యూనిట్ ఏర్పాటు చేసి మానిటరింగ్ ప్రారంభించామని చెప్పారు. ఈ మేరకు అందిన సమాచారం మేరకు పైరసీ సినిమాలను అప్‌లోడ్ చేస్తున్న, ప్రదర్శిస్తున్న 42,151 యూఆర్ఎల్స్‌ను బ్లాక్ చేశామని చెప్పారు.

ప్రధాన హోస్టింగ్ సర్వర్లకు 87 నోటీసులు జారీ చేశామని, 8 మంది. అనుమానితులను గుర్తించి ఇప్పటి వరకు ఐదుగురిని. అరెస్టు చేశామని తెలిపారు. యాంటీ పైరసీ చర్యల వల్ల గత ఏడు నెలల్లో 20కి పైగా సినిమాలను పైరసీ నుంచి కాపాడి సినీ పరిశ్రమకు రూ.33.6 కోట్ల నష్టాన్ని నివారించామని శిఖా గోయల్ తెలిపారు.

Updated Date - Nov 22 , 2026 | 08:55 AM