National Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాల వేదిక మార్చేశారు..

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:16 PM

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలుగా గుర్తింపు పొందిన జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఈసారి చారిత్రక వేదికపై జరగనుంది.

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలుగా గుర్తింపు పొందిన జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఈసారి చారిత్రక వేదికపై జరగనుంది. ఏడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న సంప్రదాయానికి భిన్నంగా.. తొలిసారిగా ఢిల్లీ వెలుపల ఈ వేడుకను నిర్వహించనున్నారు. గుజరాత్‌లోని కేవాడియా, ప్రస్తుతం ఏక్తానగర్‌గా (Ektanagar) పిలుస్తున్న ప్రాంతం ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి  వేదిక కానుంది.

జాతీయ చలన చిత్ర అవార్డుల (National Awards) ప్రదానోత్సవానికి 1954లో శ్రీకారం చుట్టారు. తొలి కార్యక్రమం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగింది. అప్పటి నుంచి ఎక్కువగా దేశ రాజధానిలోనే ఈ వేడుకలను నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి కొత్త వేదికను ఎంపిక చేశారు. ఈ నెల 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను విజేతలకు అందజేయనున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఈ సందర్భంగా పురస్కారాలు అందనున్నాయి.

ఇక ఈ వేడుకకు వేదికగా ఎంపికైన ఏక్తానగర్‌కు మరో ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ ఇక్కడే కొలువై ఉంది. పర్యాటక కేంద్రంగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రాంతంలో జాతీయ స్థాయి సినీ పురస్కారాల కార్యక్రమం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 72 ఏళ్ల చరిత్రలో తొలిసారి జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుక ఢిల్లీ దాటి నిర్వహించనుండటంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Updated Date - Sep 08 , 2026 | 01:19 PM